మోదీ అంటే ఒక విశ్వాసమని.. దేశం అభివృద్ధి చెందాలంటే NDA సర్కార్ ఉండాలని.. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. విశాఖపట్నంలోని ఏయూ యూనివర్సిటీలో ప్రధాని మోదీపై చంద్రబాబు ప్రశంసలు కురిపించారు. రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయే రోజు ఇదని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. 2.10 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశామని పేర్కొన్నారు. మూడోసారి ఎన్నికైన తర్వాత మొదటిసారి ప్రధాని ఏపీకి వచ్చారని.. ఎన్నో పెట్టుబడుల్ని అందించారని పేర్కొన్నారు.
ఇక దేశం అభివృద్ధి చెందాలంటే ఎన్డిఏ సర్కార్ ఉండాలని అన్నారు సీఎం చంద్రబాబు. ప్రధాని మోదీని స్ఫూర్తిగా తీసుకొని అభివృద్ధిలో నిత్యం ముందుకు వెళతామని తెలిపారు. త్వరలో అమరావతికి రావాలని మోదీని ఆహ్వానించారు చంద్రబాబు. మోడీకి ఏ సమస్య చెప్పినా వెంటనే అర్థం చేసుకుంటారని.. పనులు త్వరగా పూర్తయ్యేలా చొరవ చూపిస్తారని కొనియాడారు. గతంలో ఏ ప్రధాని కూడా ఇంత చొరవ తీసుకోలేదని పేర్కొన్నారు. నదుల అనుసంధానం తమ లక్ష్యం అని అన్నారు.. ఇందుకోసం కేంద్రం సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇక సూపర్ సిక్స్ పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తామన్న చంద్రబాబు.. దాని బాధ్యత NDA ప్రభుత్వానిదేనిని తెలిపారు.
ఎన్డీఏ బలంగా ఉంటే భారతదేశం బలంగా ఉంటుందని.. డబుల్ ఇంజన్ సర్కార్, డబుల్ డిజిట్ వృద్ధి ఉండాలన్నారు. కేంద్రం, రాష్ట్రం కలిసి పనిచేస్తే రెండంకెల అభివృద్ధి జరుగుతుందని.. పేదరిక నిర్మూలన సాధ్యమవుతుందన్నారు. రాష్ట్రంలో పేదరికాన్ని రూపుమాపి, ఆర్థిక అసమానతల్ని తగ్గిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు చంద్రబాబు. ప్రపంచవ్యాప్తంగా అరకు బ్రాండ్ కి విలువ పెరగడానికి ప్రధాని మోదీనే కారణమని తెలిపారు. రాష్ట్రంలో గూగుల్ పెట్టుబడికి సిద్ధమైన తరుణంలో తాను ప్రధాని మోదీని కలిశానని అన్నారు. ఆ సందర్భంలో టాక్స్ సిస్టం గురించి మాట్లాడుకున్నామని వివరించారు. భవిష్యత్తులో టాక్స్ పాలసీ మారితే పరిస్థితి ఏంటని తాను మోదీని ప్రశ్నించానని.. అలాంటి ఆలోచన ఎన్డీఏ ప్రభుత్వానికి ఉంటే దేశానికి పెట్టుబడులు రావని మోడీ స్పష్టంగా చెప్పారని పేర్కొన్నారు.
ఇటీవల హర్యానాలో, మహారాష్ట్రలో ఎన్నికలు జరిగాయి… ఈ రెండు చోట్ల ఎన్డీయే కూటమి తిరుగులేని విజయం సాధించిందిని చంద్రబాబు నాయుడు గుర్తు చేశారు. ఇక త్వరలో ఢిల్లీ ఎన్నికలు వస్తున్నాయని.. అక్కడ కూడా NDA గెలవబోతోందని పేర్కొన్నారు. దీనికి ప్రధాన కారణ నరేంద్ర మోదీ అని తెలిపారు. దేశం కోసం పనిచేస్తే ప్రజలందరూ వెంట నిలుస్తారు. ఇందుకు ఇవాళ్టి సభలో మోదీ మోదీ నినాదాలే అందుకు నిదర్శన మని చంద్రబాబు నాయుడు అన్నారు.