National Handloom Day 2025 Special Story: కంటికి కనిపించని వేల పోగులను ఒక్కటి చేసి రంగులతో అందాలు అద్దే నేర్పరి…నాజూకు నేతతో చీరను చేసి వనిత అందాన్ని పెంచిన గడసరి…అగ్గిపెట్టెలో చీరను చేర్చి ప్రపంచాన్ని అబ్బురపరిచిన ధీశాలి.. ఈ పద్మశాలి!
ఎంత ఖ్యాతి గడించిన ఏమి లాభం…నేడు తాను నేసిన చీరలే తనకు ఉరి తాళ్లవుతున్నాయి. గుర్తింపులు పేరుకే కానీ గుక్కెడు గంజి నీళ్లకు కూడా పనికి రావడం లేదు. కళాఖండాలు నేసిన మగ్గాలు నేడు చితి పేర్పులుగా మారుతున్నాయి. నాడు గొప్పగా వెలుగొందిన చేనేత.. నేడు ఛీ..నేతగా మసకబారుతున్న వైనం. ఒకప్పుడు మగ్గం చప్పుళ్లు కళ్యాణ రాగాల్లా వినిపించేవి..నేడు అవే మగ్గం గోతుల్లో శవాలై విలపిస్తున్నాయి. పట్టుచీరను ప్రపంచానికి అందించిన నేతన్న.. ఇప్పుడు పట్టెడు అన్నం దొరకని దీనస్థితిలో ఉన్నాడు. ఒకప్పుడు రంగు రంగులు చీరలు చేసిన నేతన్న…ఇప్పుడు అతని జీవితంలో రంగులు లేకుండా చేసుకున్నాడు.
మానవాళికి వస్త్రాన్ని అందించి నాగరికతను నేర్పిన చేనేత రంగం కష్టాలు, కన్నీళ్ల కలబోత అవుతోంది. నాడు మగ్గం చప్పుళ్లతో కళకళలాడిన గ్రామాల్లో నేడు నిశ్శబ్దం ఆవరిస్తోంది. అనాదిగా వస్తున్న కులవృత్తి పొట్ట నింపకపోవడంతో చేనేత కార్మికులు క్రమంగా వృత్తిని వీడుతున్నారు. మరికొందరు ఇతరవృత్తుల్లో ఇమడలేక…అందులోనే జీవనపోరాటం చేస్తున్నారు. ఈ పరిస్థితి తమ పిల్లలకు రావద్దని ఇతర పనుల్లోకి పంపుతున్నారు. పర్యావసనంగా చేనేత పరిశ్రమ మనుగడ మున్ముందు ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉంది.
విదేశీ నాగరికతా మోజులో స్వదేశీ చేనేత వస్త్రాలను చులకనా భావంతో చూస్తున్న ప్రజల ఆలోచనలలో …మరమగ్గాల అభివృద్ధిలో చేనేత కార్మికుల జీవితాలు చిరిగిన వస్త్రమైంది. .! అగ్గి పెట్టెలో ఇమిడే చీరను నేసి ప్రపంచానికి చేనేత కళావైభవాన్ని చాటి చెప్పిన ఘనత మన నేతన్నలది. చేనేత రంగంలో అంతటి ఖ్యాతి గడించిన వాళ్లు నేడు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. గిట్టుబాటు లేక బతుకు భారమైంది. మగ్గాలు మరణశయ్యపై ఉన్నాయి.
నైపుణ్యం ఉన్నా.. పనిలేక నేతన్నలు పస్తులుండాల్సిన దుస్థితి నెలకొన్నది. ఆకలి చావుల కన్నా ఆత్మహత్యలు మేలనుకునే స్థితికి దిగజారింది. గత ప్రభుత్వాలు ఇక్కడి ప్రజలను కేవలం ఓటుబ్యాంకుగా వాడుకుంటున్నాయి…తప్ప వారిని ఆదుకునే ప్రభుత్వాలే కరవయ్యాయి.
భరతావని ఆత్మకు ప్రతీకగా చేనేత రంగాన్ని అలనాడు బాపూజీ అభివర్ణించారు. కానీ నేడు ఆ చేనేత రంగం అనేక సమస్యలు, సవాళ్లతో ఉక్కిరిబిక్కిరవుతోంది. వృత్తిని నమ్ముకుని జీవనం సాగించే నేతన్నలు.. వారు తయారుచేసిన చీరలను అమ్ముకోలేని దుస్థితిని ఎదుర్కొంటున్నారు. నేసిన చీరలు అమ్ముడుపోక కార్మికులు.. కొనుగోలు లేక వ్యాపారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా తమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు.


