ఆంధ్రప్రదేశ్ పదో తరగతి ఫలితాల్లో మరోసారి అమ్మాయిలు అద్భుత విజయాన్ని నమోదు చేసింది. కాకినాడ జిల్లా శాంతి నగర్‌లోని భాష్యం స్కూల్‌కు చెందిన నేహాంజలి 600కి 600 మార్కులు సాధించి సంచలనం సృష్టించింది. పదో తరగతి పరీక్షలు నిర్వహించిన మొత్తం మార్కులకే సమానంగా అన్ని సబ్జెక్టుల్లోనూ పూర్తి మార్కులు సాధించడం రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారి అని అధికారులు వెల్లడించారు.
నేహాంజలి సాధించిన ఈ అద్భుత ఫలితంతో అందరూ షాక్ అయ్యారు. పరీక్షల ఫలితాలు వెలువడిన కొద్దిసేపటికే ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అన్ని సబ్జెక్టుల్లోనూ పూర్తి మార్కులు సాధించడం సాధ్యమేనా అని నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేకంగా ఇంగ్లీష్ సబ్జెక్ట్‌లో వందకి వంద మార్కులు రావడం ఎలా సాధ్యమైందనే దానిపై చర్చలు నడుస్తున్నాయి.
భాష్యం స్కూల్ యాజమాన్యం నేహాంజలిని ఘనంగా సత్కరించింది. విద్యార్థినిపై తనకు గర్వంగా ఉందని పేర్కొంటూ, ఇది భాష్యం సంస్థకు ఓ గౌరవ సూచకంగా భావిస్తున్నామని తెలిపింది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కూడా నేహాంజలిని అభినందించారు.
ఈ సందర్భంగా నేహాంజలి మాట్లాడుతూ దేవుని ఆశీస్సులతో పాటు, తల్లిదండ్రులు, స్కూల్ టీచర్ల ప్రోత్సాహంతోనే ఈ స్థాయికి చేరగలిగానని తెలిపింది. పదో తరగతిలో రాష్ట్రవ్యాప్తంగా మొదటి స్థానం సాధించిన తన విజయాన్ని ఆమె అందరికీ అంకితం చేస్తూ, ఈ ఘనత తన జీవితంలో మరిచిపోలేని ఘట్టమని పేర్కొంది.