Saturday, November 15, 2025
Homeఆంధ్రప్రదేశ్New Polocy: రాష్ట్రంలో కొత్త బార్ పాలసీ!

New Polocy: రాష్ట్రంలో కొత్త బార్ పాలసీ!

New Bar Polocy: ఆంధ్రప్రదేశ్‌లో సెప్టెంబర్ 1వ తేదీ నుంచి కొత్త బార్ పాలసీ అమల్లోకి రానుంది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మద్యం విక్రయాలపై కొత్త విధానం రూపకల్పన చేయడంలో మంత్రివర్గ ఉపసంఘం సమర్పించిన నివేదిక ఆధారంగా ఈ పాలసీని రూపొందించినట్లు సీఎం తెలిపారు.

- Advertisement -

సాధారణంగా మద్యం పాలసీ అంటే ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా రాష్ట్రాలు ముందడుగు వేస్తుంటాయని సీఎం అన్నారు. కానీ, తమ ప్రభుత్వం దానికంటే ప్రజల ఆరోగ్యమే మొదటి ప్రాధాన్యతగా తీసుకుంటుందని చెప్పారు. మద్యంలో ఆల్కహాల్ శాతం తక్కువగా ఉండే బ్రాండ్లను ప్రోత్సహించడం ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని గణనీయంగా పరిరక్షించవచ్చని అభిప్రాయపడ్డారు. గతంలో నాణ్యత లేని మద్యం వల్ల అనేక కుటుంబాలు నష్టపోయిన ఘటనలు ఉన్నాయని గుర్తు చేశారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి, మంత్రులు కొల్లు రవీంద్ర, కొండపల్లి శ్రీనివాస్, ఇతర అధికారులు పాల్గొన్న సమీక్షలో తాజా బార్ పాలసీ ప్రతిపాదనలు పరిశీలించామని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 840 బార్లకు గడువు ముగియనుండటంతో, కొత్త లైసెన్సులు లాటరీ విధానంలో జారీ చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. జనాభా ఆధారంగా లైసెన్స్ ఫీజులు నిర్ణయించబడ్డాయన్నారు.

50,000 లోపు జనాభా ఉన్న పట్టణాల్లో రూ. 35 లక్షలు,
5 లక్షల లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ. 55 లక్షలు,
5 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాల్లో రూ. 75 లక్షలుగా లైసెన్స్ ఫీజు నిర్ణయించారు.

అప్లికేషన్ ఫీజులు, లైసెన్స్ ఫీజుల ద్వారా రాష్ట్రానికి సుమారు రూ.700 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. ప్రతి బార్ కోసం కనీసం నాలుగు అప్లికేషన్లు ఉండేలా నిబంధన విధించనున్నారు. అలాగే, బార్ల లైసెన్సులలో గీతకులాలకు 10 శాతం రిజర్వేషన్ కేటాయించేందుకు చర్యలు తీసుకుంటామని సీఎం తెలిపారు. ఇది ఇప్పటికే మద్యం దుకాణాల విషయంలో అమలవుతున్న విధానానికి అనుగుణంగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

మరోవైపు, ఏపీ సరిహద్దుల్లో లిక్కర్ అమ్మకాలపై కూడా సమీక్ష జరిగింది. మన రాష్ట్రంలో మద్యం ధరలు తగ్గడం, అన్ని బ్రాండ్లు అందుబాటులో ఉండటం, నాణ్యత గల మద్యం లభించడం వల్ల సరిహద్దు ప్రాంతాల్లోని వినియోగదారులు పొరుగు రాష్ట్రాల కంటే ఏపీకే ప్రాధాన్యత ఇస్తున్నారని అధికారులు పేర్కొన్నారు. గతంలో నాణ్యమైన మద్యం లభించక, అధిక ధరల కారణంగా ఇతర రాష్ట్రాలకి వెళ్లే ప్రజలు ఇప్పుడు తమ అవసరాల్ని ఏపీలోనే తీర్చుకుంటున్నారని వివరించారు.

ఇక, అక్రమ మద్యం (ID లిక్కర్) నిర్మూలనపై ప్రభుత్వం చేపట్టిన చర్యల విషయం కూడా సీఎం సమీక్షించారు. ఇప్పటి వరకు 12 జిల్లాలను ఐడీ లిక్కర్-ఫ్రీగా ప్రకటించగా, ఈ నెలలో మరో 8 జిల్లాలను అదే విధంగా ప్రకటించేందుకు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. సెప్టెంబర్ నాటికి మిగిలిన 6 జిల్లాలకూ ఇదే విధంగా ‘ID లిక్కర్ ఫ్రీ’ హోదా ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త బార్ పాలసీ ఆదాయానికన్నా ప్రజల ఆరోగ్యాన్ని ప్రధానంగా పరిగణనలోకి తీసుకుంది. లైసెన్సు ప్రక్రియలో పారదర్శకత, సామాజిక న్యాయం, నాణ్యత నియంత్రణ అంశాలకు పెద్దపీట వేశారని తెలుస్తోంది.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad