Fake Ghee to Tirupati: కలియుగ ప్రత్యక్ష దైవంగా తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రతీక. ఆయన విషయంలో తేడాలు చేసివారికి పుట్టగతులు ఉండవని పెద్దవాళ్లు చెబుతుంటారు. అయితే గత వైసీపీ పాలనలో తిరుమల ప్రసాదాల కోసం కల్తీ నెయ్యిని సరఫరా చేశారనే అంశంపై వివాదం కొనసాగటంతో పాటు దర్యాప్తు కూడా వేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇందులో తవ్వే కొద్ది కొత్త విషయాలు బయటపడుతున్నాయని అధికారులు చెబుతున్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానం ఉపయోగించే లడ్డూ ప్రసాద నెయ్యి విషయంలో పెద్ద మోసం వెలుగులోకి వచ్చింది. సీబీఐ ఆధ్వర్యంలో ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందంఈ మోసాన్ని ఛేదించింది. 2019 నుంచి 2024 వరకు ఐదేళ్లపాటు సాగిన ఈ స్కామ్‌లో ప్రధాన నిందితుడు, రసాయనాలను సరఫరా చేసిన అజయ్ కుమార్ సుగంధ్‌ను ఇటీవల అరెస్ట్ చేశారు. అసలు ఒక్క చుక్క కూడా పాలు ప్రాసెసింగ్ చేయకుండానే లక్షల లీటర్ల నెయ్యి శ్రీవారి ఆలయ అవసరాల కోసం సరఫరా ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
అజయ్ కుమార్ సుగంధ్ మోనోడైగ్లైసరైడ్స్, అసిటిక్ యాసిడ్ ఎస్టర్ వంటి రసాయనాలను భోల్ బాబా ఆర్గానిక్ డైరీకి నెయ్యి సరఫరా చేసినట్లు SIT రిమాండ్ నివేదిక వెల్లడించింది. ఈ డైరీకి ఉత్తరాఖండ్‌లోని భగవాన్‌పూర్ గ్రామంలో పోమిల్ జైన్, విపిన్ జైన్‌లు ప్రమోటర్లుగా ఉన్నారు. తమ డైరీని నకిలీ నెయ్యి తయారీ యూనిట్‌గా మార్చి, పాల సేకరణ, చెల్లింపుల రికార్డులను సృష్టించినట్లు సీబీఐ తేల్చింది. 2022లో ఈ సంస్థ బ్లాక్‌లిస్ట్ అయినా.. ఇతర డైరీల పేరుతో టీటీడీ టెండర్లలో పాల్గొని నెయ్యి సరఫరా కొనసాగించిందని అధికారులు గుర్తించారు. వీటిలో తిరుపతికి చెందిన వైష్ణవి డైరీ, ఉత్తరప్రదేశ్‌లోని మాల్ గంగా, తమిళనాడులోని ఏఆర్ డైరీ ఫుడ్స్ ఉన్నాయి.
గత సంవత్సరం టీటీడీ.. ఏఆర్ డైరీ సరఫరా చేసిన నాలుగు కంటైనర్ల నెయ్యిలో జంతు కొవ్వు కల్తీ ఉన్న కారణంగా తిరస్కరించింది. తరువాత అదే స్టాక్ ను భోల్ బాబా డైరీ, వైష్ణవి డైరీ ద్వారా మళ్లీ టీటీడీకి సరఫరా చేసినట్లు విచారణలో బయటపడింది. సిట్ చేసిన దర్యాప్తులో నెయ్యి ట్యాంకర్లు తిరిగి ఏఆర్ డైరీకి వెళ్లకుండా.. వైష్ణవి డైరీకి సమీపంలోని స్టోన్ క్రషింగ్ యూనిట్‌కు తరలించినట్లు తేలింది. అక్కడ ట్యాంకర్‌లపై లేబుల్స్ మార్చి, సింథటిక్ నెయ్యి నాణ్యత పెంచి 2024 ఆగస్టులో మళ్లీ తిరుపతికి సరఫరా చేశారని తేలింది.
ఈ నకిలీ ఘీ లడ్డూ ప్రసాదాల తయారీలో వినియోగించబడిందని సీబీఐ వెల్లడించింది. ప్రస్తుతం SIT, టీటీడీ అధికారులు అన్ని డైరీ యజమానులపై ఆర్థిక, న్యాయ విచారణ కొనసాగిస్తున్నారు. మెుత్తానికి ఐదేళ్లలో 68 లక్షల లీటర్ల నెయ్యి సరఫరా కాగా ఇందులో ఎంత మెుత్తం కల్తీ చేశారు. అసలు మెుత్తం కల్తీ నెయ్యేనా.. అందులో ఏం కలిపారు అనే వివరాలను బయటకు లాగే పనిలో అధికారులు ముందుకు సాగుతున్నారు.


