Polytechnic Colleges| ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి విద్యావ్యవస్థపై ప్రత్యేక దృష్టి పెట్టింది. అందుకే విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్(Nara Lokesh) బాధ్యతలు స్వీకరించారు. గత ఐదేళ్లలో గాడి తప్పిన విద్యావ్యవస్థను సరైన మార్గంలో తీసుకురావడానికే లోకేష్.. ఈ శాఖ మంత్రి తీసుకున్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నారు. అందుకు తగ్గట్లే లోకేష్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ప్రభుత్వం స్కూళ్లలో మౌలిక వసతులు ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అలాగే పిల్లలకు మధ్యాహ్న భోజనం పథకం మెనూలో మార్పులు తీసుకొచ్చారు. అంతేకాకుండా ఈ పథకానికి అన్నపూర్ణమ్మ డొక్కా సీతమ్మ పేరు పెట్టారు. ఇవే కాకుండా విద్యారంగం పథకాలకు గత ప్రభుత్వం పెట్టిన జగనన్న పేర్లను మార్చి వివిధ ప్రముఖుల పేర్లు పెట్టారు.
తాజాగా మచిలీపట్నంలో ఏర్పాటుచేసిన ప్రభుత్వ మెడికల్ కాలేజీకి స్వాతంత్ర్య సమరయోధులు, జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య పేరు పెడుతూ జీవో విడుదల చేశారు. ఈ నిర్ణయం పట్ల అన్ని వర్గాల నుంచి ప్రశంసలు లభించారు. ఈ క్రమంలోనే తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కుటుంబ బాధ్యతల కారణంగా చదువు మధ్యలో ఆపేసి పనులకు వెళ్తున్న వారికి శుభవార్త చెప్పారు. ఉదయం పనులు చేసుకుంటూ రాత్రిళ్లు చదువుకోవాలనుకునే వారి కోసం నైట్ పాలిటెక్నిక్ కాలేజీలను ఓపెన్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈమేరకు ప్రభుత్వం జీవో విడుదల చేసింది. పదోతరగతి, ఐటీఐలు చేసి చదువు మధ్యలో ఆపేసిన వారికోసం కొత్తగా 6 పాలిటెక్నిక్ కాలేజీలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
ఈ కాలేజీలను విశాఖలో 3, చిత్తూరులో 2, రాజమహేంద్రవరంలో 1 చొప్పున ఏర్పాటు చేయనున్నారు. ఈ కాలేజీల్లో సోమవారం నుంచి శనివారం వరకు సాయంత్రం 6 నుంచి 9 గంటల వరకు.. సెలవు రోజైనా ఆదివారం పూర్తి స్థాయిలో తరగతులను నిర్వహించనుంది. ఆయా కళాశాలల్లో మొత్తం 429 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఆసక్తి గల వారు ఈ నెల 26వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈనెల 28న ఉదయం 10 గంటలకు కౌన్సెలింగ్‌కు వచ్చేవారు అర్హత ధ్రువపత్రాలు, చెల్లించాల్సిన ఫీజుతో రావాలని అధికారులు తెలిపారు.
ఇక ప్రభుత్వం అందించనున్న కోర్సుల్లో రెండేళ్ల పాటు కంప్యూటర్, ఎలక్ట్రికల్-ఎలక్ట్రానిక్స్, సివిల్ ఇంజినీరింగ్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్-కమ్యూనికేషన్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇక రెండున్నరేళ్ల కోర్సుల్లో కెమికల్ ఇంజినీరింగ్, కెమికల్(ఆయిల్ టెక్నాలజీ), కెమికల్(పెట్రోకెమికల్) ఉన్నాయి. కాగా గతంలో ఉద్యోగం చేస్తూనే ఇంజినీరింగ్ చదివేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఇప్పుడు డిప్లొమా కోర్సులకు అనుమతించింది. ప్రభుత్వం నిర్ణయంపై విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.