TDP Vs YSRCP: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంలో గత ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కుట్రలు చేస్తున్నారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాజకీయ పావుగా అంబటి రాంబాబు?
లడ్డూ వివాదం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే అంబటి రాంబాబును జగన్ ఒక పావులా వాడుకుంటున్నారని నిమ్మల ఆరోపించారు. కాపు సామాజికవర్గ నాయకులను కేవలం ఓటు యంత్రాలుగా, అవసరానికి వాడుకునే సాధనాలుగా మాత్రమే వైకాపా చూస్తోందని మండిపడ్డారు. గతంలో కాపు రిజర్వేషన్లను జగన్ రద్దు చేస్తున్న సమయంలో అంబటి నోరెత్తకపోవడాన్ని ఆయన గుర్తు చేశారు. అంబటి కుటుంబ సభ్యులు, సానుభూతిపరులు ఇప్పటికైనా జగన్ తీరును నిలదీయాలని కోరారు.
ముద్రగడ, అంబటిలపై విమర్శల వర్షం
ముద్రగడ పద్మనాభం తన పేరును మార్చుకున్న విషయాన్ని ప్రస్తావిస్తూ, “ముద్రగడ పద్మనాభ రెడ్డి అని పేరు పెట్టుకున్న వ్యక్తికి కాపుల గురించి మాట్లాడే అర్హత లేదు” అని నిమ్మల వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడు తల్లిదండ్రులను ఉద్దేశించి అంబటి అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు ఆయన కుటుంబ సభ్యులు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. సమాజంలో కులాల మధ్య విభేదాలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందడమే వైపీపీ వ్యూహమని ఆరోపించారు.
కాపుల సంక్షేమం, భవిష్యత్తు కేవలం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని, గతంలో టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధి పనులే ఇందుకు సాక్ష్యమని నిమ్మల పేర్కొన్నారు. హిందువుల సెంటిమెంట్లను దెబ్బతీసిన కల్తీ లడ్డూ వ్యవహారంలో బాధ్యులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. వైసీపీ తన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి కులం కార్డును ప్రయోగిస్తోందని, ప్రజలు ఈ రాజకీయ నాటకాలను గమనిస్తున్నారని ఆయన హెచ్చరించారు.

