Nitin Gadkari On Vijayawada Hyderabad Highway: విజయవాడ – హైదరాబాద్ మధ్య ప్రయాణించేవారికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ శుభవార్త తెలిపారు. విజయవాడ-హైదరాబాద్ మధ్య కొత్త గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మిస్తామని, దీనికి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారుచేయాలని అధికారులకు ఆదేశాలిచ్చినట్లు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. ఈ రహదారి నిర్మాణం పూర్తైతే విజయవాడ నుంచి హైదరాబాద్‌కు రెండు గంటల్లోనే చేరుకోవచ్చని పేర్కొన్నారు. శనివారం మంగళగిరిలో నితిన్ గడ్కరీ.. జాతీయ రహదారుల శంకుస్థాపన, ప్రారంభ కార్యక్రమంలో పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు. “సీఎం చంద్రబాబు కోరినట్లుగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సహకరిస్తాం.” అని తెలిపారు.
Also Read: https://teluguprabha.net/andhra-pradesh-news/cm-chandrababu-naidu-launches-annadata-sukhibhava-orders-swift-solutions-for-farmers/
భవానీపురం వరకు ఆరు లేన్లుగా..
ఈ ఎన్‌హెచ్ 65ను ఆరు లేన్లుగా… భవానీపురంలోని పున్నమి ఘాట్ వరకు విస్తరించనున్నట్లు తెలిసింది. ఈ హైవే నిర్మాణం గొల్లపూడితో పాటు భవానీపురం వరకు జరిగితే.. గొల్లపూడి, దుర్గ గుడి ప్రాంతవాసులు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టినట్టవుతుంది. అలాగే హైదరాబాద్ నుంచి వచ్చే ప్రయాణికులకు, అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు, అలానే నగరంలో ప్రయాణించేవారికి ఉపశమనం కలుగుతుంది. పైగా ఎలాగో గొల్లపూడిలోనే ఎన్టీఆర్ జిల్లాకు చెందిన వివిధ శాఖల ఆఫీసులు ఉన్నాయి. ఆ కార్యాలయాలకు వెళ్లే వారికి కూడా ప్రయాణం సులభం అవుతుంది. ఈ నిర్మణానికి అవసరమైన నిధులు మంజూరు చేస్తానని గడ్కరీ.. ఎంపీ చిన్నికి తెలిపారు. విస్తరణ వల్ల రోడ్డు మధ్యలో సుందరీకరణ పనులు చేపట్టి, కాలుష్యానికి చెక్ పెట్టాలని అధికారులు భావిస్తున్నారు.
Also Read: https://teluguprabha.net/andhra-pradesh-news/birth-anniversary-of-tirupati-laddu/
వచ్చే రెండేళ్లలో అమెరికాకు సమానంగా…
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో రూ.2.5 లక్షల కోట్ల రోడ్ల పనులు జరుగుతున్నాయని, అలాగే ఈ ఆర్థిక సంవత్సరం ముగియక ముందే.. రూ.లక్ష కోట్ల కొత్త పనులు ప్రారంభించబోతున్నామని గడ్కరీ అన్నారు. వచ్చే రెండేళ్లలో ఆంధ్రప్రదేశ్‌లో రోడ్లు అమెరికాకు సమానంగా ఉంటాయని హామీ ఇచ్చారు.”ఏపీలోనూ ప్రమాదాల సంఖ్య ఎక్కువగా ఉంది. అందుకు గల కారణాలను పరిశీలించాం. ఈ ప్రమాదాలను నివారించేందుకు నివేదిక తయారు చేశాం. ప్రమాదాలు తగ్గించడంపై సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, మంత్రులు దృష్టిపెట్టాలి’ అని గడ్కరీ కోరారు. మోదీ ప్రధాని అయ్యాక ఏపీలో జాతీయ రహదారులు పదేళ్లలో 120% పెరిగి 8,700 కి.మీ.కి చేరాయి. హైడ్రోజన్‌పై ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం నుంచి బయ్యవరం వరకు ప్రాజెక్టును వోల్వోకు ఇచ్చాం” అని తెలిపారు.


