Northeast monsoon: దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాల తిరోగమనం చురుగ్గా సాగుతోంది. ఇప్పటికే ఉత్తర, మధ్య భారతాన్ని వీడిన నైరుతి రుతపవనాలు.. నేడు తెలుగు రాష్ట్రాలనుంచి సైతం పూర్తిగా నిష్క్రమించాయి. దీంతో ఈశాన్య రుతుపవనాల ప్రవేశానికి మార్గం సుగమమైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నెల 17 నుంచి 20వ తేదీ మధ్యలో ఈశాన్య రుతుపవనాల రాక మొదలయ్యే వాతావరణం కనిపిస్తోందని అంచనా వేశారు. ఈశాన్య రుతుపవనాల ప్రభావం ఎక్కవగా ఆంధ్రప్రదేశ్‌తో పాటుగా తమిళనాడు, కర్ణాటక, కేరళ పాండిచ్చేరిలో ప్రభావం చూపించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది.
వరుస అల్పపీడనాలు: ఈశాన్య రుతుపవనాల రాకతో అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య వరుస అల్పపీడనాలు ఏర్పడే అవకాశాలున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా తుపాన్లు సైతం రానున్నాయి. ఇవి తమిళనాడు లేదా ఆంధ్రప్రదేశ్ వద్ద తీరందాటే సూచనలు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. మరోవైపు నైరుతి నిష్క్రమణ కారణంగా రానున్న నాలుగు రోజుల పాటు కోస్తాంధ్ర, రాయలసీమల్లో విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని అన్నారు.
ముందే రానున్న ఈశాన్య రుతుపవనాలు: సాధారణంగా ఈ రుతుపవనాల ప్రభావం దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, పుదుచ్చేరి, కేరళతో పాటు ఏపీలోనికోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలపై ఎక్కువగా ఉంటుంది. వివిధ వాతావరణ నమూనాల అంచనాల ప్రకారం అక్టోబరు 17 నుంచి 21వ తేదీ మధ్య ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. నైరుతి రుతుపవనాల సీజన్ ముగిసిన వెంటనే ఈశాన్యం పవనాలు సైతం కరుణించనుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


