ఏపీ డిప్యూటీ సీఎం రఘురామకృష్ణం రాజు(Raghuramakrishnam raju) కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే పలువురు ఐపీఎస్ అధికారులకు నోటీసులు ఇచ్చిన ప్రభుత్వం.. తాజాగా డీఐజీ సునీల్ నాయక్‌కు నోటీసులు జారీ చేసింది. రఘురామకృష్ణం రాజును సీఐడీ ఆఫీస్‌కు తీసుకొచ్చిన సమయంలో సునీల్ నాయక్ అక్కడికి వచ్చారని ధృవీకరించారు. దీంతో ఆయనను విచారించాలని ఈ కేసు విచారణాధికారి ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ డిసైడ్ అయ్యారు. ఈమేరకు విచారణకు హాజరుకావాలని నోటీసులు పంపించారు. గత ప్రభుత్వం హయాంలో సునీల్ నాయక్ ఏపీ సీఐడీ డీఐజీగా పనిచేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే బిహార్‌కు వెళ్లిపోయారు. ప్రస్తుతం బిహార్ ఫైర్ సర్వీసెస్ డీఐజీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
కాగా రఘురామకృష్ణంరాజును 2021 మే14న అప్పటి వైసీపీ ప్రభుత్వం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. రాత్రంతా గుంటూరు సీఐడీ (CID) కార్యాలయంలో ఉంచి తనను కస్టోడియల్ టార్చర్ చేశారని RRR ఆరోపించారు. ముసుగు వేసుకున్న ఓ వ్యక్తి తనను తీవ్రంగా కొట్టారని.. గుండెల మీద కూర్చుని టార్చర్ చేశారంటూ పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం రాగానే ఈ కేసుకు సంబంధించి పలువురు ఐపీఎస్ అధికారులకు నోటీసులు జారీ చేసింది. అలాగే మాజీ డీఎస్పీ విజయ్‌పాల్‌ను అరెస్ట్ చేసింది.