NTR 30th Death Anniversary:తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీక, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా నివాళులు వెల్లువెత్తుతున్నాయి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ఎన్టీఆర్‌ను స్మరించుకుంటూ, ఆయనను “సినీ వినీలాకాశంలో ధ్రువతారగా, రాజకీయ కురుక్షేత్రంలో అజేయుడిగా” అభివర్ణించారు.
విప్లవాత్మక మార్పులకు ఆద్యుడు
తెలుగువారి చరిత్రను తిరగరాసిన ధీరోదాత్తుడు ఎన్టీఆర్ అని చంద్రబాబు పేర్కొన్నారు. కేవలం 9 నెలల కాలంలోనే అధికారంలోకి వచ్చి, దశాబ్దాల రాజకీయ ముఖచిత్రాన్ని మార్చిన ఘనత ఆయనది. పేదవాడి ఆకలి తీర్చడం కోసం రెండు రూపాయలకే కిలో బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టి, సంక్షేమ రాజ్యానికి పునాది వేశారని కొనియాడారు.
Also Read: CM Chandrababu : భారీ పెట్టుబడులే లక్ష్యంగా బాబు వేట..!
సామాజిక, పాలనా సంస్కరణలు
ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు నేటికీ మార్గదర్శకాలుగా ఉన్నాయని చంద్రబాబు గుర్తుచేశారు. అధికార వికేంద్రీకరణ కోసం మండల వ్యవస్థను తీసుకొచ్చి, పాలనను ప్రజల చెంతకు చేర్చారు. ఆస్తిలో ఆడబిడ్డలకు సమాన హక్కు కల్పించి సామాజిక విప్లవానికి నాంది పలికారు. పక్కా ఇళ్ల నిర్మాణం, రైతులకు ఉచిత విద్యుత్, సామాజిక భద్రతా పింఛన్లు వంటి పథకాలు ఆయన దార్శనికతకు నిదర్శనం. రాయలసీమకు సాగు, తాగునీటి ప్రాజెక్టుల ద్వారా ఆ ప్రాంత అభివృద్ధికి బాటలు వేశారు అనిఅన్నారు..
“తెలుగుజాతి ఉన్నంత వరకు ఎన్టీఆర్ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఆయన వేసిన బాట మనందరికీ అనుసరణీయం” అని చంద్రబాబు స్పష్టం చేశారు. ఎన్టీఆర్ ఆశయాల సాధనే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఆయన పునరుద్ఘాటించారు.

