హిందూవుల ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల(Tirumala) కొండపై విమానం(Flight)చక్కర్లు కొట్టడం కలకలం రేపుతోంది. ఆగమశాస్త్ర ప్రకారం తిరుమల కొండను నో ఫ్లైజోన్(No flyzone)గా అధికారులు ప్రకటించారు. దీని ప్రకారం కొండపై ఆకాశంలో ఎలాంటి విమానాలు, హెలికాఫ్టర్లు, డ్రోన్లు ఎగరకూడదు. అయితే ఇటీవల కాలంలో తరుచుగా కొండ మీదుగా విమానాలు, హెలికాఫర్లు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఇవాళ ఉదయం శ్రీవారి ఆలయ పరిసర ప్రాంతాల్లో విమానం తిరిగింది. దీనిపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆగమశాస్త్రానికి విరుద్ధమంటూ మండిపడుతున్నారు.
దీనిపై అప్రమత్తమైన టీటీడీ(TTD) అధికారులు ఈ విమానం ఎలా వచ్చింది..? ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందనే విషయాలపై ఆరా తీస్తున్నారు. నో ఫ్లై జోన్‌గా ఉన్న తిరుమల కొండపై ఎలా చక్కర్లు కొట్టిందనే దానిపై ఏవియేషన్ అధికారులతో మాట్లాడుతున్నారు. కాగా గతంలో ఈ ఏడాది జూన్ 7న శ్రీవారి ఆలయ సమీపం మీదుగా విమానం వెళ్లగా, ఫిబ్రవరి 15న ఆలయం గోపురం పైనుంచి రెండు జెట్ విమానాలు వెళ్లాయి. ఇక అక్టోబర్ 21న మరో విమానం వెళ్లింది.ఇక 2023 ఏప్రిల్ 25న కూడా తిరుమల కొండపై విమానం చక్కర్లు కొట్టింది. ప్రస్తుతం కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రిగా ఏపీకి చెందిన ఎంపీ రామ్మోహన్ నాయుడు(Rammohan Naidu) ఉన్న నేపథ్యంలో ఇప్పటికైనా తిరుమలను నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించాలని భక్తులు కోరుతున్నారు.