రేషన్ బియ్యం మాయం కేసు వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని(Perni Nani) కుటుంబసభ్యులకు తలనొప్పిగా మారింది. ఒకరి తర్వాత ఒకరిని పోలీసులు విచారణకు పిలుస్తుండటం వారిని ఇబ్బందికి గురిచేస్తోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఓ వెలుగు వెలిగిన నాని.. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఆయన కుటుంబానికి చెందిన గోదాంలో రేషన్ బియ్యం మాయం కావడంతో ప్రభుత్వ పెద్దలకు టార్గెట్‌గా మారారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే నాని కుటుంబసభ్యులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ కేసులో ఏ1గా నాని సతీమణి జయసుధ, ఏ6గా నానిని చేర్చారు.
మరోవైపు ఈ కేసులో జయసుధకు ఇప్పటికే మచిలీపట్నం జిల్లా కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. పోలీసు విచారణకు సహకరించాలని ఆదేశించింది. ఈ క్రమంలో మంగళవారం రాత్రి నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు పేర్ని నాని నివాసానికి వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో డోర్‌కి నోటీసులు అతికించి వచ్చారు. కేసు విచారణలో భాగంగా బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు ఆర్ పేట పోలీస్‌స్టేషన్‌కు రావాలని పేర్కొన్నారు.