పహల్గాం ఉగ్రదాడికి తగిన ప్రతీకారంగా భారత సైన్యం నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ దాడులకు దేశవ్యాప్తంగా మద్దతు వ్యక్తమవుతోంది. పదుల సంఖ్యలో ఉగ్రవాదులను మట్టుబెట్టిన ఈ వైమానిక దాడులకు సామాన్య ప్రజల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ దాడుల నేపథ్యంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ“పహల్గాంలో టూరిస్టులపై ఉగ్రవాదులు దాడిచేశారు. హిందువు కాదా అని అడిగి, ఖల్మ చదవమని చెప్పి, కిరాతకంగా హత్యలు చేశారు.
మరణించిన వారిలో ఇద్దరు ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారే. ఇటువంటి పాశవిక చర్యలకు భారత్ బదులిచ్చింది. సివిలియన్లకు హాని జరగకుండా, ఉగ్రవాదులను మాత్రమే లక్ష్యంగా చేసుకుని భారత సైన్యం రాత్రివేళ వైమానిక దాడులు చేసింది. ఇది ప్రశంసనీయమన్నారు. కాశ్మీర్ మనదేశానికి భాగమే. 1990లో పండిట్‌లపై ఎలా మారణహోమం జరిపారో అందరికీ తెలుసు. అంత్యక్రియల కోసం వచ్చిన వారినే హత్య చేశారు. అలాంటి దుర్మార్గాలకు ఈ దాడి సరైన బదులుగా నిలిచింది. గోకుల్ చాట్, లుంబినీ పార్క్ వంటి ఘటనలను మరిచిపోలేం. ఇవన్నీ గుర్తుచేసుకుంటే, సైన్యం నిర్ణయం ఎంత సమంజసమో అర్థమవుతుంది అని అన్నారు.
మిలిటరీ యుద్ధం చేస్తుంటే, మనం కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు. మాక్‌డ్రిల్ల్స్ చేయడం ద్వారా ఆత్మరక్షణపై అవగాహన పెంచుకోవాలి. దేశద్రోహ శక్తులకు తగిన సమాధానం చెప్పాలి. పోలీసులు మాట్లాడే అవకాశం కల్పించే విధంగా పిర్యాదులు చేయాలి. అలాంటి సమయంలో ఆర్మీపై విమర్శలు చేయడం సరికాదని పవన్ కళ్యాణ్ సూచించారు. అలాగే ఈ వ్యాఖ్యలు నేను అందరినీ ఉద్దేశించి చేయలేదు. కొద్ది మంది కాంగ్రెస్ నేతల వైఖరిపై మాట్లాడానని పేర్కొన్నారు. దేశ భద్రత విషయంలో అన్ని పార్టీలు, ప్రతి పౌరుడు ప్రధాని మోదీకి మద్దతుగా ఉండాలి. పాకిస్తాన్‌కు ప్రోత్సాహంగా మారేలా మాట్లాడకండి అని ఆయన హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.