పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో అమరులైన ఆంధ్రప్రదేశ్ వాసులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించారు. బుధవారం విశాఖపట్నంలో నిర్వహించిన కార్యక్రమంలో ఉగ్రదాడిలో మృతి చెందిన చంద్రమౌళికి గౌరవవందనం ఇచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సీఎం చంద్రబాబు, కశ్మీర్‌లో శాంతి నెలకొల్పేందుకు చర్యలు కొనసాగుతున్న సమయంలో ఇలాంటి ఉగ్రదాడులు జరిగితే అభివృద్ధి కుంటుపడే ప్రమాదం ఉందన్నారు. ఈ దాడిని తీవ్రంగా ఖండించిన ఆయన, ఇది అరాచక చర్యగా పేర్కొన్నారు. దేశ ప్రజలంతా ఈ దాడిని ఖండించాలని పిలుపునిచ్చారు.
ఉగ్రవాదుల చొరబాట్లను నిరోధించేందుకు సరిహద్దుల్లో మరింత కట్టుదిట్టమైన భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పహల్గామ్ ఘటనలో విశాఖపట్నం ప్రాంతానికి చెందిన చంద్రమౌళి, కావలి ప్రాంతానికి చెందిన మధుసూదనరావు ప్రాణాలు కోల్పోయినట్టు తెలిపారు. ఈ ఘటన పట్ల తమ ప్రభుత్వం సంతాపం వ్యక్తం చేస్తోందని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలను ఆదుకునేందుకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు.