రాప్తాడు ఎమ్మెల్యే, మాజీ మంత్రి పరిటాల సునీత తన భర్త పరిటాల రవి హత్యపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి కూడా సంబంధం ఉందని ఆమె ఆరోపించారు. ఆ రోజుల్లో సీబీఐ జగన్‌ను విచారించిందని సునీత తెలిపారు. టీవీ బాంబు గురించి మాట్లాడే వారు, కారు బాంబు ఘటనను కూడా ప్రస్తావించాలని అన్నారు.
తోపుదుర్తి సోదరులు స్వార్థ ప్రయోజనాల కోసం ఫ్యాక్షన్ రాజకీయాలను మళ్లీ రెచ్చగొడుతున్నారని పరిటాల సునీత మండిపడ్డారు. ఓబుల్ రెడ్డి, మద్దెల చెరువు సూరి కుటుంబాలను ఇందులోకి లాగే ప్రయత్నం జరుగుతోందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. “గంగుల భానుమతి, కనుముక్కల ఉమాకు విజ్ఞప్తి చేసిన సునీత.. ఫ్యాక్షన్ కారణంగా తమ కుటుంబాలు తీవ్రంగా నష్టపోయాయని… ఈ దుస్థితి నుంచి బయటపడేందుకు చాలా సమయం పట్టిందని తెలిపారు. ఇప్పుడు మళ్లీ తోపుదుర్తి సోదరులు ఈ వ్యవహారంలో మిమ్మల్ని లాగుతున్నారు. వారి కుట్రలో భాగం కావొద్దు” అంటూ ఆమె సూచించారు.
ఫ్యాక్షన్‌ను రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనం పొందాలని తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి చూస్తున్నారని ఆమె విమర్శించారు. పాపంపేటలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇళ్లను కూల్చివేయడం జరిగిందని, కానీ మూడు రోజుల తర్వాత బాధితులను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. తమ కుటుంబం ఎప్పుడూ ఇచ్చే కుటుంబం, కానీ తీసుకునే కుటుంబం కాదు అని అన్నారు.
ఎంపీపీ ఎన్నికల విషయంలో తాను ఎలాంటి జోక్యం చేసుకోలేదని, అయితే అలా జరిగి ఉంటే రామగిరి ఎంపీపీ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వశం అయ్యేదని చెప్పారు. తమ ఎంపీటీసీలపై నమ్మకం లేకనే వారిని క్యాంపులకు తరలించారని తెలిపారు. తోపుదుర్తి చందు గతంలో చంద్రబాబు, లోకేశ్‌లపై ఎలా మాట్లాడాడో అందరూ చూశారని, ఇప్పుడు కేసుల భయంతో జగన్‌ను గారు అని సంభోదిస్తున్నాడని ఎద్దేవా చేశారు.
జగన్‌కు శుక్రవారం శుభదినంగా మారిందని, అందుకే పాపిరెడ్డిపల్లికి రావాలని నిర్ణయించుకున్నారని ఆమె వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. జగన్ తన సూట్‌కేసులో కొన్ని బట్టలు ఎక్కువగా తీసుకురావాలి. ఇక్కడ లింగమయ్యతో పాటు మీ పార్టీ బాధితులను కూడా పరామర్శించాలి. తోపుదుర్తి బ్రదర్స్ వల్ల గత ఐదేళ్లలో మీ పార్టీకి చెందిన చాలా మంది నష్టపోయారు. వారినీ పరామర్శిస్తే మంచిది” అని సూచించారు. ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో జగన్ పర్యటించి ఫ్యాక్షన్ రాజకీయాలను మళ్లీ రగిలించవద్దని, ప్రజలను మరోసారి అస్థిర పరిస్థితుల వైపు నెట్టవద్దని పరిటాల సునీత విజ్ఞప్తి చేశారు.