శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్(Jagan) పర్యటించిన సంగతి తెలిసిందే. ఇటీవల హత్యకు గురైన లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి నేతలకు కొమ్ముకాస్తూ వైసీపీ కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న పోలీసుల బట్టలు ఊడదీసి కొడతామని ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్ వ్యాఖ్యలపై రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత(Paritala Sunitha) కౌంటర్ ఇచ్చారు.
అసలు జగన్ పరామర్శకు వచ్చారా..? ఎన్నికల ప్రచారానికి వచ్చారా..? అని మండిపడ్డారు. చావు ఇంటికి వచ్చి జేజేలు కొట్టించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. బాధిత కుటుంబాన్ని చూసి నవ్వుతున్నావో.. ఏడుస్తున్నావో అర్థం కావడం లేదని సెటైర్లు వేశారు. జగన్ మాట్లాడినవన్నీ పచ్చి అబద్ధాలు అని.. తోపుదూర్తి ప్రకాష్ రెడ్డి రాసిచ్చిన స్క్రిప్టు చదివారని విమర్శించారు. మీ చిన్నాన్నని చంపితే చెల్లికి న్యాయం చేయలేని జగన్.. తల్లి, చెల్లెళ్లకు న్యాయం చేయలేని జగన్.. లింగమయ్య కుటుంబానికి ఏం న్యాయం చేస్తారని నిలదీశారు. మాజీ సీఎం అయి ఉండి పోలీసులపై నీచంగా మాట్లాడుతున్నారని.. ఇప్పటికైనా పోలీసులు జగన్ వ్యాఖ్యలపై స్పందించాలని ఆమె డిమాండ్ చేశారు.