BRS vs Kavitha : ‘ ఎమ్మెల్సీ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని మాజీ మంత్రులు, నేతలు స్వాగతించారు. ఈ నిర్ణయం పార్టీ శ్రేణులకు స్థైర్యాన్ని ఇస్తుందని వారు అభిప్రాయపడ్డారు.
మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ, కేసీఆర్ నిర్ణయంతో మహిళలు ఎంతగానో సంతోషిస్తున్నారని తెలిపారు. కవిత చేసిన వ్యాఖ్యలు పార్టీకి, కార్యకర్తల మనోభావాలకు నష్టం కలిగించాయని ఆమె అన్నారు. “తప్పు చేస్తే సొంత కుటుంబ సభ్యులనైనా ఉపేక్షించేది లేదని కేసీఆర్ గతంలో చెప్పారు, దానికి అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నారు” అని ఆమె పేర్కొన్నారు. “పార్టీని నమ్ముకున్న కార్యకర్తల కంటే పేగుబంధం గొప్పది కాదని కేసీఆర్ భావించారు” అని సత్యవతి రాథోడ్ అన్నారు.
మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మాట్లాడుతూ, కవిత వ్యాఖ్యలు “పార్టీ ఉంటే ఎంత, పోతే ఎంత” అన్నట్లుగా ఉన్నాయని విమర్శించారు. కవితకు పార్టీ అనేక అవకాశాలు కల్పించిందని, కేసీఆర్ కన్నతండ్రి లాంటివారని ఆమె అన్నారు. “పార్టీ నుంచి బయటకు వెళ్లిన చాలా మంది ఏమయ్యారో అందరికీ తెలుసు, కవిత కూడా అంతే” అని ఆమె వ్యాఖ్యానించారు.
అలాగే, మాజీ ఎంపీ మాలోత్ కవిత కూడా కేసీఆర్ నిర్ణయాన్ని సమర్థించారు. కవిత చేసిన వ్యాఖ్యలు బాధ కలిగించాయని, “పేగు బంధం కంటే పార్టీ బంధం, ప్రజా బంధం గొప్పది” అని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని ఆమె అన్నారు. తెలంగాణ కోసం గతంలో ప్రాణాన్ని పణంగా పెట్టిన కేసీఆర్, ఇప్పుడు పార్టీ కోసం తన కుటుంబ బంధాన్ని కూడా త్యాగం చేశారని మాలోత్ కవిత పేర్కొన్నారు. ఈ సాహసోపేత నిర్ణయం బీఆర్‌ఎస్ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుందని నేతలు అభిప్రాయపడ్డారు.


