స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పార్వతీపురం మన్యం జిల్లాలో రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యా రాణి శ్రీకారం చుట్టారు. ప్రతి మూడవ శనివారం “స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర” కార్యక్రమాన్ని నిర్వహించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు శనివారం సాలూరు మున్సిపాలిటీలో మంత్రి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
స్వచ్ఛందంగా చీపురు పట్టి
చేత చీపురు పట్టారు. రహదారులను శుభ్రం చేశారు. స్ఫూర్తి పొందిన ప్రజలు ఈ ఉద్యమంలో పాల్గొని చీపుర్లు పట్టి శుభ్రత కార్యక్రమానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. రహదారి ప్రక్కనే ఉన్న బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో కలుపు మొక్కలు బాగా పెరిగి ఉండటంతో కొడవలి పట్టి వాటిని తొలగించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలోనే అత్యంత పరిశుభ్ర రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో నెలలో మూడవ శనివారం “స్వచ్ఛత” కోసం అంకితం కావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు ఇచ్చారని చెప్పారు. పర్యావరణ పరిరక్షణ అంశంలో సామాజిక భాగస్వామ్యం (కమ్యునిటీ ఎంగేజ్ మెంట్) ను ప్రోత్సహించడం, పరిశుభ్రమైన వాతావరణం ద్వారా ప్రజారోగ్య పరిరక్షణ, పర్యావరణంపై కాలుష్య ప్రభావాన్ని తగ్గించడం, పర్యాటకులు, యాత్రికులు, పెట్టుబడిదారులను మరింత ఆహ్వానించే విధంగా ఆహ్లదకరమైన వాతావరణాన్ని కల్పించడం, ఆర్థిక ప్రయోజనాలను మెరుగుపర్చడం, పిల్లలు, భవిష్యత్ తరాల వారికి పర్యావరణ పరిశుభ్రతపై అవగాహన కల్పించడం అనే లక్ష్యాలతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆమె వివరించారు. మార్గదర్శకాలకు అనుగుణంగా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ప్రజాప్రతినిధులు, అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున భాగస్వామ్యం కావాలని ఆమె కోరారు.
కార్యక్రమంపై ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని ఆమె అన్నారు. స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్రలో భాగంగా పల్లెలు, పట్టణాలలో ఎక్కడా పారిశుధ్య సమస్య ఉండకుండా మంచి ఆరోగ్యవంతమైన పరిసరాలు ఏర్పాటు చేసుకోవడం మన బాధ్యత అన్నారు. చెత్త కుప్పల తొలగింపు, తాగు నీటి వసతుల క్లోరినేషన్, మురుగు కాలువలు శుభ్రం చేయడం, చెరువుల వద్ద చెత్త లేకుండా చూడటం, సామాజిక మరుగుదొడ్లను గుర్తించడం – ఉపయోగంలోకి తీసుకురావడం, ఇంటింటా తడిచెత్త – పొడిచెత్త ప్రక్రియ కొనసాగించడం, కార్యాలయాలు పరిశుభ్రంగా ఉంచడం వంటి అంశాలను చేపట్టాలని ఆమె పేర్కొన్నారు. అన్ని గ్రామ పంచాయతీలు బహిరంగ మలవిసర్జన రహిత పంచాయతీలుగా మారాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
ఒక్కో నెలలో ఒక్కో థీమ్ తో
ప్రతి నెల ఒక థీమ్ తో స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోందని ఆమె వెల్లడించారు. జనవరి మాసంలో “న్యూ ఇయర్ – క్లీన్ స్టార్” థీమ్ తోను, ఫిబ్రవరి మాసంలో “సోర్సు – రిసోర్సు” , మార్చిలో “అవాయిడ్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ – ప్రమోట్ రీయూజబుల్స్”, ఏప్రిల్ లో “ఇ-చెక్, మే లో “నీరు-మీరు”, జూన్ లో “బీట్ ది హీట్”, జులై లో “ఎండింగ్ ప్లాస్టిక్ పొల్యూషన్”, ఆగస్టు లో “మాన్ సూన్ హైజినిక్”, సెప్టెంబరు లో “గ్రీన్ ఏ.పి”, అక్టోబరులో “క్లీన్ ఎయిర్”, నవంబరులో “పర్సనల్ అండ్ కమ్యునిటీ హైజిన్”, డిశంబరు మాసంలో “ఆపర్చునిటీస్ ఇన్ ఎన్విరాన్మెంట్” థీమ్ లతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ సందర్భంగా ర్యాలిని నిర్వహించి, మానవహారాన్ని నిర్వహించారు.
ఎన్టీఆర్ కు నివాళి
అంతకముందు మాజీ ముఖ్య మంత్రి ఎన్ టి రామారావు వర్ధంతి సందర్భంగా బోసు బొమ్మ కూడలి వద్ద ఎన్ టి ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం చిన్నారులకు, గర్భిణీలకు స్థానిక స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన పౌష్టిక ఆహార కిట్లను, అంగన్వాడి కేంద్రానికి ఆట వస్తువులను మంత్రి పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్ ఎస్ శోబిక, పార్వతీపురం ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి మరియు పార్వతీపురం సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా గ్రామ పంచాయతీ అధికారి తమర్భ కొండలరావు, జిల్లా వ్యవసాయ అధికారి కె. రాబర్ట్ పాల్, మున్సిపల్ కమిషనర్ సి హెచ్ సత్యనారాయణ, తహసీల్దార్ ఎన్ వి రమణ తదితరులు పాల్గొన్నారు.