పాస్టర్ ప్రవీణ్ పగడాల (Pastor Praveen) మృతి తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఆయన మృతిపై క్రిస్టియన్ సంఘాలు అనుమానం వ్యక్తం చేశాయి. ప్రవీణ్‌ది హత్య అని ప్రభుత్వం, పోలీసులు నిందితులను పట్టుకోవాలని డిమాండ్ చేశాయి. ఈ వ్యవహారంపై సీఎం చంద్రబాబు స్పందించి సమగ్ర విచారణ జరపాలని పోలీసులను ఆదేశించారు. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదే సమయంలో మాజీ ఎంపీ హర్ష కుమార్ (Harsha Kumar)పాస్టర్ మృతిపై సంచలన ఆరోపణలు చేశారు. పాస్టర్ ప్రవీణ్ పగడాలను ఎక్కడో హత్య చేసి.. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారని ఆరోపించారు. పోలీసులు ఈ కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని దీనిపై తన వద్ద ఆధారాలు ఉన్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై చేసిన ఆరోపణలకు తగిన ఆధారాలతో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే పోలీసుల విచారణకు హాజరుకాకుండా మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేశారు. దీంతో పాస్టర్ ప్రవీణ్ మృతి కేసులో తప్పుడు ఆరోపణలు చేశారంటూ హర్షకుమార్‌పై బీఎన్ఎస్ సెక్షన్ 196, 197 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.