Pawan Kalyan: నటుడు విజయ్ అధ్యక్షుడుగా ఉన్న తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ నిర్వహించిన ర్యాలీలో చోటు చేసుకున్న తీవ్ర తొక్కిసలాట (Stampede) యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. తమిళనాడులోని కరూర్‌లో జరిగిన ఈ దురదృష్టకర ఘటనలో ఇప్పటి వరకు 31 మంది మరణించినట్టు ప్రాథమిక సమాచారం అందుతోంది. వీరిలో పార్టీ కార్యకర్తలతో పాటు ఆరుగురు చిన్నారులు ఉండటం మరింత ఆవేదన కలిగిస్తోంది. ఈ ఘోరంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆవేదన
ప్రాథమిక సమాచారం మేరకు పదుల సంఖ్యలో మృతి చెందారన్న వార్త తనను కలచివేసిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. “మృతుల్లో చిన్నారులు ఉండటం అత్యంత బాధాకరం. ఈ దుర్ఘటన కారణంగా కుటుంబ సభ్యులను కోల్పోయిన వారికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను” అని పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో తెలిపారు.
క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ఆయన తమిళనాడు ప్రభుత్వాన్ని కోరారు. ఈ సంఘటన భవిష్యత్తులో ప్రజా సమావేశాల నిర్వహణలో తీసుకోవాల్సిన భద్రతాపరమైన జాగ్రత్తలను మరోసారి గుర్తు చేసిందని ఆయన అన్నారు.
కరూర్‌లో ఏం జరిగింది?
కరూర్‌లో విజయ్ నిర్వహించిన ప్రచార సభకు ఊహించని విధంగా భారీ సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. వేలాది మంది ప్రజలు ఒక్కసారిగా పోటెత్తడంతో వారిని నియంత్రించడం పోలీసులకు, పార్టీ వాలంటీర్లకు కష్టంగా మారింది. ఈ క్రమంలోనే తీవ్ర తొక్కిసలాట చోటుచేసుకుంది. అభిమానులు ఒకరిపై ఒకరు పడిపోవడంతో అనేక మంది ఊపిరాడక స్పృహతప్పి పడిపోయారు.
పరిస్థితి విషమించడంతో, నటుడు, టీవీకే అధ్యక్షుడు విజయ్ వెంటనే తన ప్రసంగాన్ని మధ్యలోనే నిలిపివేశారు. అతికష్టం మీద సంఘటన స్థలానికి చేరుకున్న అంబులెన్సుల్లో బాధితులను స్థానిక ఆసుపత్రులకు తరలించారు. తొక్కిసలాట కారణంగా మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దుర్ఘటనపై తమిళనాడు ప్రభుత్వం దర్యాప్తుకు ఆదేశించింది. భద్రతా లోపాలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజా సమూహాల నిర్వహణలో భద్రతా ప్రమాణాలపై రాజకీయ పార్టీలు మరింత దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని ఈ విషాద ఘటన మరోసారి చాటిచెప్పింది


