Saturday, February 14, 2026
Homeఆంధ్రప్రదేశ్Pawan Kalyan : అమ్మ పుట్టినరోజున అపురూప కానుక.. 2 జిరాఫీలను దత్తత తీసుకున్న పవన్‌..

Pawan Kalyan : అమ్మ పుట్టినరోజున అపురూప కానుక.. 2 జిరాఫీలను దత్తత తీసుకున్న పవన్‌..

Pawan Kalyan Adopts Giraffes : ఓ వైపు పాలనా బాధ్యతలు.. మరోవైపు పర్యావరణ పరిరక్షణపై ప్రత్యేక శ్రద్ధ.. వెరసి ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్ విశాఖ పర్యటన ఆసక్తికరంగా సాగింది. మాటలకంటే చేతలే మిన్న అని నిరూపిస్తూ, తన తల్లి పుట్టినరోజున మూగజీవాల పట్ల ఆయన చూపిన ప్రేమ అందరినీ ఆకట్టుకుంది. సాగర తీర నగరం విశాఖపట్నంలోని ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాల (Vizag Zoo) వేదికగా ఆయన తీసుకున్న నిర్ణయం వన్యప్రాణి ప్రేమికులను విశేషంగా ఆకర్షించింది. తన తల్లి అంజనాదేవి జన్మదినాన్ని పురస్కరించుకుని పవన్‌ కల్యాణ్ ఏకంగా రెండు జిరాఫీలను దత్తత తీసుకున్నారు. అంతేకాకుండా జంతు సంరక్షణ కోసం కార్పొరేట్ సంస్థలకు ఒక కీలక పిలుపునిచ్చారు. కంబాలకొండలో కనోపీ వాక్ చేస్తూ ప్రకృతిని ఆస్వాదించారు. 

- Advertisement -

అమ్మ పేరిట ‘వన్యప్రాణి’ సంరక్షణ : విశాఖ పర్యటనలో భాగంగా డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాలను సందర్శించారు. గురువారం తన తల్లి అంజనాదేవి పుట్టినరోజు కావడంతో, ఈ సందర్భాన్ని చిరస్మరణీయంగా మార్చుకున్నారు. జూలోని రెండు జిరాఫీలను ఏడాది పాటు దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు.

వ్యక్తిగత విరాళం: ఆ రెండు జిరాఫీలకు ఏడాది పాటు అయ్యే ఆహారం, వైద్యం, ఇతర నిర్వహణ ఖర్చులను తన సొంత నిధుల నుంచి భరిస్తానని పవన్‌ వెల్లడించారు. స్వయంగా జిరాఫీలకు, ఏనుగులకు ఆహారాన్ని తినిపించి వాటితో కాసేపు గడిపారు. వాటి పేర్లు, అలవాట్లను జూ క్యూరేటర్లను అడిగి తెలుసుకున్నారు.

ఎలుగుబంట్ల ఎన్‌క్లోజర్ ప్రారంభం : జూ అభివృద్ధిలో భాగంగా కొత్తగా నిర్మించిన ఎలుగుబంట్ల ఎన్‌క్లోజర్‌ను పవన్‌ కల్యాణ్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వన్యప్రాణుల సంరక్షణ కేవలం ప్రభుత్వం బాధ్యతే కాదని, సమాజం కూడా భాగస్వామ్యం కావాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా కార్పొరేట్ సంస్థలు తమ సీఎస్‌ఆర్ (CSR) నిధుల ద్వారా జంతువులను దత్తత తీసుకోవడానికి, జూ అభివృద్ధికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

కంబాలకొండలో ‘కనోపీ వాక్’ : అనంతరం కంబాలకొండ ఎకో పార్కును సందర్శించిన పవన్‌, అక్కడ ‘నగరవనాన్ని’ ప్రారంభించారు. ప్రకృతి ఒడిలో కాసేపు సేదతీరుతూ, పార్కులోని చెక్క వంతెనపై ‘కనోపీ వాక్’ చేశారు. అడవి, పర్యావరణ పరిరక్షణ విషయాల్లో పవన్‌కు ఉన్న ప్రత్యేక ఆసక్తి తెలిసిందే. గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన ఎకో పార్కులను తిరిగి గాడిలో పెట్టేందుకు, వాటి ఆధునికీకరణకు ఆయన ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. అక్కడ ఉన్న అరుదైన మొక్కల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

సహజ సిద్ధమైన అడవి: ఇందిరాగాంధీ జూ ప్రత్యేకత : దేశంలోనే పేరొందిన జూలలో ఒకటైన విశాఖ జూ.. 625 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఇక్కడ 123 జాతులకు చెందిన 840కి పైగా జంతువులు, పక్షులు, సరీసృపాలు ఉన్నాయి. అడవిని తలపించే సహజ వాతావరణంలో  జంతువులను ఉంచడం ఇక్కడి ప్రత్యేకత. సింహాల గాండ్రింపులు, పక్షుల కిలకిలరావాలతో నిత్యం కళకళలాడే ఈ జూలో.. జంతువులకు సమతుల్య ఆహారం, వ్యాయామం, వైద్య సంరక్షణతో కూడిన శాస్త్రీయ పద్ధతులను పాటిస్తున్నారు. పర్యావరణ హితమే ఊపిరిగా పవన్‌ కల్యాణ్ చేసిన ఈ పని, భవిష్యత్ తరాలకు, జంతు ప్రేమికులకు గొప్ప స్ఫూర్తిగా నిలుస్తుందనడంలో సందేహం లేదు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News