Pawan Kalyan Comments on Green Ammonia Plant: ప్రధాని నరేంద్ర మోదీ సారధ్యంలోని కేంద్ర ప్రభుత్వం ఏపీ అభివృద్ధికి పూర్తి స్థాయిలో సహకరిస్తుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. శనివారం కాకినాడ పట్టణంలో గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టుకు సీఎం చంద్రబాబుతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. పునరుత్పాదక ఇంధన రంగాన్ని ప్రోత్సహిస్తూ, ఆ రంగంలో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే మొదటి స్థానంలో నిలపాలన్నది కూటమి ప్రభుత్వ లక్ష్యం అన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ అభివృద్ధిలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. రెన్యువెబుల్ ఎనర్జీ రంగంలో రాష్ట్రాన్ని దేశంలోనే మొదటి స్థానంలో నిలపడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. దేశ కాలుష్య రహిత ఇంధన ప్రయాణంలో గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టు కీలక మైలురాయి అని తెలిపారు. బలమైన సంకల్పం ఉంటే ఏదైనా సాధించగలం అని గ్రీన్ కో వ్యవస్థాపకులు శ్రీ చలమలశెట్టి అనిల్ నిరూపించారన్నారు. అనేక కష్టనష్టాలను తట్టుకుని ఈ రోజున ఏఎం గ్రీన్ కంపెనీ స్థాపించారని గుర్తు చేశారు. కాకినాడలో 495 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టు ఏర్పాటు కానుందని, ఏడాదికి 1.5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. రూ. 15, 600 కోట్లు పెట్టుబడితో ప్రారంభం కాబోతున్న ఈ సంస్థలో 8 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పాదక ఇంధన పెట్టుబడులు రానున్నాయని గుర్తు చేశారు. ఈ ప్లాంట్ నిర్మాణ దశలో సుమారు 8,000 మందికి, ఆపరేషన్ దశలో సుమారు 1,500 మందికి ప్రత్యక్ష ఉపాధి, పరోక్షంగా కొన్ని వేల మందికి దీర్ఘకాల ఉపాధి అవకాశాలు కలగనున్నాయని, ఈ ప్రాజెక్టు విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటునని తెలిపారు.
యువతకు వేలాదిగా ఉద్యోగావకాశాలు..
గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా వంటి శుద్ధ ఇంధనాల ఉత్పత్తికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పించగలిగితే పెట్టుబడిదారుల్లో విశ్వాసం పెరుగుతుందని ఆయన గుర్తు చేశారు. గ్రీన్ ఎనర్జీ ఉత్పాదనకు ఆంధ్రప్రదేశ్ గమ్యస్థానం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. క్లీన్ ఎనర్జీ పాలసీని సద్వినియోగం చేసుకుంటూ ఏఎం గ్రీన్ సంస్థ కాకినాడలో దేశంలోనే మొట్టమొదటి మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గ్రీన్ అమ్మోనియా తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. దేశ కాలుష్య రహిత ఇంధన ప్రయాణంలో ఇదో చారిత్రక మైలురాయిగా నిలుస్తుందన్నారు. గత ప్రభుత్వం అధికారం చేపట్టిన రెండు నెలల్లోనే విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు రద్దు చేసి, పునః సమీక్ష పేరిట విద్యుత్ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టేసిందని, కియా లాంటి సంస్థ ప్రతినిధులపై కూడా బహిరంగ బెదిరింపులకు దిగిందని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో పెట్టుబడిదారులకు సహకరిస్తూ.. యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా అడుగులు వేస్తుందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు, శానస సభ్యులు, కాకినాడ జిల్లా ఉన్నతాధికారులు, ఏఎం గ్రీన్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.

