Pawan Kalyan Temple Safety Orders : పవిత్ర కార్తీక మాసం సందర్భంగా కాకినాడ జిల్లా పరిధిలో ప్రముఖ ఆలయాలకు భక్తుల రద్దీ పెరిగిన నేపథ్యంలో, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. భక్తుల భద్రత, సౌకర్యాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని, క్యూ లైన్ నిర్వహణ, పారిశుద్ధ్యం, భద్రతా చర్యలు సరైన రీతిలో తీసుకోవాలని సూచించారు.
కార్తిక మాసం భక్తుల రద్దీ నేపథ్యంలో కాకినాడ జిల్లా కలెక్టర్, ఎస్పీ, వివిధ శాఖల అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. భక్తులకు ఏ విధమైన అసౌకర్యం తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.
ALSO READ: Chevella Accident: చేవెళ్ల రోడ్డు ప్రమాదం.. 16 మృతదేహాలకు పోస్టుమార్టం
“కార్తీక మాసం ఎంతో పవిత్రమైనది. ప్రముఖ క్షేత్రాలకు భక్తులు భారీగా వస్తారు. ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని ముందుగానే ఏర్పాట్లు చేయాలి. దేవాదాయ, పోలీసు, పంచాయతీరాజ్, మున్సిపల్, రెవెన్యూ శాఖలు సమన్వయంతో పనిచేయాలి” అని పవన్ కల్యాణ్ తెలిపారు. కాశీబుగ్గలో జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో ఆలయాల వద్ద తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. దేవాదాయ శాఖ అధికారులు ప్రైవేట్ సంస్థలు, వ్యక్తుల నిర్వహణలో ఉన్న ఆలయాల జాబితా సిద్ధం చేసి, కలెక్టర్, ఎస్పీలకు అందజేయాలని ఆదేశించారు.
కాకినాడ జిల్లాలో సామర్లకోట కుమార భీమేశ్వరస్వామి ఆలయం, పిఠాపురం శ్రీ పాద గయ, అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి ఆలయాలతో పాటు పలు ప్రధాన క్షేత్రాల్లో రద్దీ పెరుగుతుందని, ముందుగానే చర్యలు తీసుకోవాలని సూచించారు. నవంబర్ 5న కార్తీక పౌర్ణమి రోజు రద్దీ ముందుగానే అంచనా వేయాలని ఆదేశించారు. శని, ఆది, సోమవారాల్లో భక్తుల రద్దీ ఊహించని విధంగా పెరుగుతుందని, ఆలయాల ప్రాంగణంలో క్యూ లైన్‌లు నిర్వహించాలని, సీసీటీవీలతో పర్యవేక్షణ ఏర్పాటు చేయాలని దిశా నిర్దేశం చేశారు. భక్తుల రద్దీకి తగిన తాత్కాలిక మరుగుదొడ్లు, పారిశుద్ధ్య నిర్వహణ స్థానిక సంస్థలు చేపట్టాలని, APSRTC బస్సులు తగినన్ని నడపాలన్నారు. రద్దీ సమయాల్లో జాతీయ రహదారులపై వాహనాల రాకపోకలు క్రమబద్ధీకరించి ప్రమాదాలు నివారించాలని సూచించారు. రద్దీ ఎక్కువ ఉన్న రోజుల్లో ఆలయాల వద్ద మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.


