గత వైసీపీ ప్రభుత్వం హయాంలో ఉపాధి హామీ పనుల్లో అవినీతిని గుర్తించామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తెలిపారు. జాతీయ ఉపాధి హామీ పథకంలో అవినీతిపై అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు.జాతీయ ఉపాధి హామీ పథకంపై తాను ప్రత్యేక దృష్టి పెట్టానని తెలిపారు. వైసీపీ హయాంలో రూ.250 కోట్ల అవినీతి జరిగినట్లు అధికారులు తమ దృష్టికి తెచ్చారని చెప్పారు. ఇప్పటికే అవినీతికి పాల్పడ్డ కొంతమందిని సస్పెండ్ చేశామన్నారు. ఉపాధి హామీ కూలీలకు వేతనాల పెంపు అంశం కేంద్రం పరిధిలో ఉంటుందని చెప్పుకొచ్చారు.
సోషల్ ఆడిట్, విజిలెన్స్ సెల్, క్వాలిటీ కంట్రోల్‌లో కొత్త అధికారులను నియమించామన్నారు. దుర్వినియోగం అయిన కొంత సొమ్ము రికవరీ చేశామని పేర్కొన్నారు. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చాయన్నారు. రూ.250 కోట్ల అవినీతి జాతీయ ఉపాధి హామీ పథకంలో జరిగిందని.. సాక్షాధారాలు లేకపోవడంతో కేవలం రూ.74 కోట్లు మాత్రమే రికవరీ అయ్యే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే రూ.71 లక్షలు రికవరీ చేశామని పవన్ వెల్లడించారు.