Pawan Kalyan Key Instructions to Officials on Cyclone: మొంథా తుపాను ఏపీని వణికిస్తోంది. తీర ప్రాంతంలో ఇప్పటికే తుఫాను ప్రభావం మొదలైంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేశారు. ఇవాళ మొంథా తుపాను కాకినాడ ప్రాంతంలో తీరం దాటనుందని తెలిపారు. ఈ క్రమంలో కాకినాడ జిల్లాలో చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో పవన్ కల్యాణ్ తన క్యాంపు కార్యాలయంలో సోమవారం వీడియో కాన్పరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షకు కాకినాడ జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొంగూరు నారాయణ, స్పెషల్ ఆఫీసర్ కృష్ణ తేజ, జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, జిల్లా ఎస్పీ బిందు మాధవ్, ఇతర అధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో పవన్ కల్యాణ్ అధికారులకి పలు కీలక సూచనలు చేశారు. కాకినాడ జిల్లాలో 12 మండలాలపై మొంథా తుపాను ప్రభావం ఎక్కువ ఉంటుందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు వారికి అవసరమైన ఆహారం, రక్షిత తాగునీరు, పాలు, ఔషధాలు సమకూర్చుకోవాలని మార్గనిర్దేశం చేశారు. డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలు, గజ ఈతగాళ్లు సిద్ధంగా ఉన్నారని చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని ప్రజలకి తెలియజేసి, అప్రమత్తం చేయాలని కోరారు. ప్రజలు ఎలాంటి ఆందోళనకి గురికాకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మొంథా తుపాను తీరం దాటే సమయంలో గాలుల తీవ్రత ఎక్కువగా ఉన్నందున విద్యుత్ స్తంభాలు పడిపోయే అవకాశం ఉంటుందని, జాగ్రతలు తీసుకోవాలని పేర్కొన్నారు. తుఫాను దృష్ట్యా విద్యుత్ స్తంభాలు ఒకవేళ పడిపోతే వాటి పునరుద్ధరణకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. గర్భిణులు, బాలింతలు, వృద్ధులు, రోగులను గుర్తించి.. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. 24 గంటలూ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాలు జారీ చేశారు.
12 మండలాలపై తుఫాను ప్రభావం..
కాగా, మొంథా తుపాను ప్రభావం కాకినాడ జిల్లా పరిధిలోని 12 మండలాలపై ఉండనున్నట్టు వాతావరణ శాఖ హెచ్చరికల ద్వారా తెలుస్తోందని. మంగళవారం కాకినాడ పరిసరాల్లో తీరం దాటే అవకాశం ఉందని ఆయన అయన అన్నారు. తుపాను తీరం దాటే సమయంలో బలమైన ఈదురుగాలులు, అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని. తుపానును ఎదుర్కొనేందుకు ప్రభావిత మండలాల పరిధిలో యంత్రాంగం పూర్తి సన్నద్దతో ఉండాలన్నారు. ముందస్తు రక్షణ చర్యలు భాగంగా తీర ప్రాంత గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. అయితే ఇప్పటికే 260 పునరావాస కేంద్రాలను గుర్తించినట్టు అధికారులు పవన్ కల్యాణ్‌కు తెలిపారు. పిఠాపురం నియోజకవర్గంతో పాటు కాకినాడ జిల్లావ్యాప్తంగా ఇప్పటికే 142 మంది గర్భిణులను గుర్తించి పునరావాస కేంద్రాలకు తరలించినట్టు జిల్లా కలెక్టర్ తెలిపారు. వారికి అవసరం అయిన పౌష్టికాహారం, వైద్య సాయం అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేసిన విషయాన్ని ప్రజలకు తెలియజేయాలని, తుపాను పట్ల ప్రజల్లో భయాందోళనలు లేకుండా గ్రామాల్లో మైకుల ద్వారా తుపాను ప్రభావం, తీసుకుంటున్న సహాయక చర్యలను వివరించాలని పవన్ కల్యాణ్ సూచించారు.


