వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddireddy Ramchandra Reddy) చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. చిత్తూరు జిల్లా మంగళంపేట సమీపంలోని అడవుల్లో భూకబ్జా చేసినట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలపై డిప్యూటీ సీఎం, అటవీశాఖ మంత్రి పవన్ కళ్యాణ్(Pawan Kalyan) విచారణకు ఆదేశించారు. దీనిపై విచారణ జరిపి సత్వరమే ప్రాథమిక నివేదిక సమర్పించాలని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
పుంగనూరు నియోజకవర్గం పరిధిలో ఉన్న అటవీ భూముల రికార్డులను పరిశీలించాలని, అడవుల ధ్వంసంపై నిగ్గు తేల్చాలని ఆదేశించారు. అటవీ భూముల రికార్డులు ఎక్కడైనా తారుమారు చేశారా? అనే కోణంలో దర్యాప్తు చేయాలని సూచించారు. భూరికార్డుల తారుమారులో ఎవరి పాత్ర ఉంది..? ఎవరు లబ్ధి పొందారో..? తేల్చాలని సూచించారు. అనంతరం అటవీ భూములు ఆక్రమించినవారిపై చట్టపరంగా ముందుకు వెళ్లాలని పేర్కొన్నారు.