జాతీయ ఉపాధి హామీ పథకం రాష్ట్రాభివృద్ధికి వెన్నెముకగా మారిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తెలిపారు. మంగళగిరిలోని సి.కె.కన్వెన్షన్ హాలులో నిర్వహించిన మేడే ఉత్సవాలు సందర్భంగా ఉపాధి హామీ శ్రామికులతో ముఖాముఖి నిర్వహించి మాట్లాడారు. ఉపాధి హామీ పథకం రాష్ట్రం, దేశానికి ఒక వరమని పేర్కొన్నారు. సుమారు 75 లక్షల 23 వేల మంది శ్రామికులు సొంత గ్రామాల్లోనే ఉపాధి పొందుతున్నారని చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంలోనే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో రూ.10,669 కోట్లు ఖర్చు చేశామన్నారు. కేవలం వేతనాలకే రూ.6,194 కోట్ల వ్యయం అయిందన్నారు.
పల్లె పండుగలో భాగంగా ఇప్పటివరకు రూ.377.37 కోట్లతో 21,564 గోకులాలు పూర్తి చేశామన్నారు. దీని వల్ల ప్రతి రైతుకు నెలకు రూ.4,200 అదనపు ఆదాయం వస్తోందన్నారు. ఉపాధి కూలీలను ఉపాధి శ్రామికులుగా పిలుద్దామని పిలుపునిచ్చారు. ఉపాధి హామీ శ్రామికులకు ప్రధానమంత్రి జీవిత బీమా కల్పించినట్లు తెలిపారు. ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.2 లక్షల జీవిత బీమా లభిస్తుందని పవన్ వెల్లడించారు.