Pawan Kalyan on Freebies ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఉచిత పధకాలకు త్వరలో మంగళం పాడనుందా అంటే అలాంటి సందేహాలే ఉత్పన్నమౌతున్నాయి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన తాజా ట్వీట్ అదే స్పష్టం చేస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఏపీలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం అతి కష్టంగానే పలు సంక్షేమ పథకాలు అందిస్తోంది. 2024 ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు వెంటనే కాకున్నా ఒక్కొక్కటికీ పధకాలు అమలు చేస్తోంది. పెన్షన్ పెంపు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆటో డ్రైవర్లకు 15 వేలు పథకాలు ప్రస్తుతం అమల్లో ఉన్నాయి. ఇంకా మహిళలకు ప్రతి నెలా ఇస్తామని చెప్పిన 1500 రూపాయలు, నిరుద్యోగ భృతి 3 వేల రూపాయలు అమలు కావల్సి ఉంది. అధికారంలో వచ్చిన ఏడాదిన్నర కాకుండానే 2.18 లక్షల కోట్లు అప్పు చేసిందని తెలుస్తోంది. ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందనే భయంతో సంక్షేమ పధకాలు అయిష్టంగానే అమలు చేస్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా కన్పిస్తోంది. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం వ్యాఖ్యలు, తాజా పోస్ట్ చూస్తే కూటమి ప్రభుత్వం త్వరలో ఈ పథకాలకు మంగళం పాడుతుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి.
పవన్ కళ్యాణ్ ఏమన్నారు..
మాకు ఉచితాలు కాదు..పాతికేళ్ల భవిష్యత్ ఇవ్వండి అంటూ శ్రీకాకుళంలో యువత తనతో చెప్పిన సంగతిని గుర్తు చేసుకుంటూ అప్పటి ఫోటోను పవన్ కళ్యాణ్ షేర్ చేశారు. 2018 తిత్లీ తుపాను నేపధ్యంలో ప్రజల్ని పరామర్శించినప్పుడు ఈ ఘటన జరిగిందని ఇప్పటికీ గుర్తుందని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలే ఇప్పుడు పలు సందేహాలకు దారిస్తున్నాయి. ఇదేదో యాధృఛ్చికంగా లేదా యధాలాపంగా షేర్ చేసింది కానే కాదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడూ పాత విషయాలు షేర్ చేసిన పరిస్థితి లేదు. ఇప్పుడు కొత్తగా ఏడేళ్ల క్రితం జరిగిన సంఘటనను గుర్తు చేసి మరీ పోస్ట్ చేయడంలో ఆంతర్యమేంటనే ప్రశ్నలు విన్పిస్తున్నాయి.
సంక్షేమానికి మంగళం పాడేందుకేనా
కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం హోదాలో ఉంటూ, ఎన్నికల ప్రచారంలో అన్ని సంక్షేమ పథకాలను కొనసాగిస్తామని, వైసీపీ ప్రభుత్వం కంటే పది రూపాయలు అదనంగానే ఇస్తామని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడీ వ్యాఖ్యలు చేయడంలో అర్ధమేంటనే వాదన విన్పిస్తోంది. ఇది కేవలం పవన్ కళ్యాణ్ తనంతట తానుగా పోస్ట్ చేసింది కాదని తెలుస్తోంది. దీని వెనుక చంద్రబాబు వ్యూహం ఉందనేది వైసీపీ నేతల వాదన. ఉచితాలను యువత కోరుకోవడం లేదనే అంశాన్నిప్రజల్లో పంపించి..ఫీడ్ బ్యాక్ ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నమంటున్నారు. పవన్ కళ్యాణ్ పోస్టు ద్వారా ఉచిత పథకాలకు వ్యతిరేకంగా ప్రకటనను ప్రజల్లో పంపించి..అదును చూసి కొన్ని పథకాలను కట్ చేసే ఆలోచన ఉండి ఉండవచ్చంటున్నారు.
లేని పక్షంలో ఎెప్పుడో ఏడేళ్ల క్రితం నాటి తెలుగుదేశం ప్రభుత్వంతో బంధాన్ని తెగదెంపులు చేసుకున్న క్రమంలో జరిగిన ఘటనను ఇప్పుడు గుర్తు చేయడం దేనిని సూచిస్తుందని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ మధ్యనే ఆటో డ్రైవర్లకు 15 వేల పథకం లాంచ్ చేసినప్పుడు ఆ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ సైతం పాల్గొన్నారు. అలాంటప్పుడు ఉచితాలకు వ్యతిరేకంగా ఎప్పుడో జరిగిన ఘటనను ఎందుకు గుర్తు చేశారో..దీని వెనుక మతలబు ఏంటనేది చెప్పాలని ప్రశ్నిస్తున్నారు.


