జనసైనికులతో పాటు తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ(JanaSena Formation Day) సభ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జనసేన అధికారంలోకి వచ్చాక మొదటి ఆవిర్భావ సభ కావడంతో భారీగా సభను నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేశారు. అందులోనూ ఆ పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) సొంత నియోజకవర్గంలో నిర్వహిస్తున్న ఈ సభకు జయకేతనం అనే పేరు పెట్టారు. ఈ సభ రాష్ట్ర చరిత్రలో మరో మైలురాయిగా నిలిచిపోతుందని జనసైనికులు చెబుతున్నారు.
ఈ సభ కోసం పవన్ కళ్యాణ్ ఇవాళ మధ్యాహ్నం 3.30 గంటలకు హెలికాఫ్టర్ ద్వారా మంగళగిరి నుంచి చిత్రాడ బహిరంగ సభ వద్దకు చేరుకుంటారు. సభ ముగిసిన అనంతరం రాత్రి JNTU కాకినాడ పోలీస్ గ్రౌండ్స్ గెస్ట్ హౌస్‌లో బస చేస్తారు. శనివారం ఉదయం 9 గంటలకు మంగళగిరికి తిరుగు ప్రయాణం అవుతారు. కాగా ఈ సభలో మొదటి ద్వారానికి పిఠాపురం మహారాజా శ్రీరాజసూర్యారావు బహుదూర్ పేరును, డొక్కా సీతమ్మ పేరును రెండో ద్వారానికి, విద్యాదానం చేసిన మల్లాడి సత్యలింగ నాయకర్ పేరుతో మూడోద్వారం ఏర్పాటు చేశారు.