Pawan kalyan With His Sons Photo Viral: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓవైపు రాజకీయాల్లో, మరోవైపు సినిమాల్లో బిజీబిజీగా ఉన్నారు. ఇటు ప్రభుత్వ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూనే తన శాఖలకు సంబంధించిన పర్యటనలు కూడా చేపడుతున్నారు. ఈ క్రమంలోనే ప్రకాశం జిల్లా మార్కాపురం పర్యటన చేపట్టారు. జలజీవన్ మిషన్ కింద రూ.1,290 కోట్లతో తాగునీటి పథకానికి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం అక్కడ నిర్వహించనున్న బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసగింస్తారు. సభ ముగింపు అనంతరం గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. పవన్ పర్యటన ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, జనసేన జిల్లా ఇన్‌ఛార్జి షేక్ రియాజ్, మార్కాపురం నియోజకవర్గ ఇన్‌ఛార్జి కాశీనాథ్, అధికారులు పర్యవేక్షించారు. పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు.
అయితే మార్కాపురం పర్యటన సందర్భంగా పవన్ కళ్యాణ్‌కు సంబంధించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తొలిసారిగా తన ఇద్దరు కుమారులతో కలిసి బహిరంగంగా కనిపించారు. రేణుదేశాయ్, పవన్ కళ్యాణ్‌కు ఇద్దరు పిల్లలు ఉన్న సంగతి తెలిసిందే. కుమారుడు అకీరా నందన్, కుమార్తె ఆదర్వ ఉన్నారు. ఇక రేణుతో విడాకుల అనంతరం విదేశీ మహిళ అన్నా లెజినోవాను పెళ్లి చేసుకోగా.. వీరికి కూడా కుమారుడు, కుమార్తె సంతానంగా కలిగారు. చిన్న కుమారుడు పేరు మార్క్ శంకర్ కాగా.. చిన్న కుమార్తె పేరు అంజనా. అయితే ఇంతవరకు పవన్‌తో పెద్ద కుమారుడు అకీరా మాత్రమే బహిరంగంగా ఆయనతో కలిసి కనిపించేవారు. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ప్రమాణస్వీకారం చేసినప్పుడు, ఇటీవల తమిళనాడులో ఆలయాల పర్యటన సందర్భంగా పవన్‌తో కలిసి అకీరా కనపించారు.
ఇంతవరకు చిన్న కుమారుడితో మాత్రం బహిరంగంగా కనిపించలేదు. అందులోనూ ఇద్దరు కుమారులతో కలిసి అసలు ఎక్కడా కనపడలేదు. తొలిసారిగా తన పెద్ద కుమారుడు అకీరా, చిన్న కుమారుడు మార్క్ శంకర్‌తో కలిసి కనిపించారు. హైదరాబాద్ నుంచి ఇద్దరు కొడుకులతో శుక్రవారం ఉదయం మంగళగిరిలోని తన నివాసానికి వచ్చారు. అనంతరం ఇద్దరితో కలిసి మార్కాపురం నియోజకవర్గ పర్యటనకు బయలుదేరారు. విమానాశ్రయంలో ఇద్దరు కొడుకులు పవన్‌కు అటు, ఇటు నడుస్తున్న ఫొటో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. మొదటిసారి ఇద్దరు కుమారులతో కలిసి కనపడటంలతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫొటో అదిరిపోయిందంటూ తెగ షేర్ చేస్తున్నారు.

ఇక పవన్ సినిమాల విషయానికి వస్తే.. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘హరిహర వీరమల్లు’ ఫస్ట్ పార్ట్ జూలై 24న థియేటర్లలో విడుదల కానుంది. ఈ క్రమంలోనే గురువారం ఉదయం విడుదల చేసిన మూవీ ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. తెలుగు ట్రైలర్ కేవలం 24 గంటల్లోనే 48 మిలియన్‌కి పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుని ఆల్‌టైమ్ రికార్డు క్రియేట్ చేసింది. అలాగే అన్ని భాషల్లో కలిపి 24 గంటల్లో 61.7 మిలియన్‌కి పైగా వ్యూస్ రాబట్టి శభాష్ అనిపించింది. ట్రైలర్‌కు వచ్చిన రెస్పాన్స్‌తో మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పవన్ కళ్యాణ్ నుంచి రెండు సంవత్సరాల తర్వాత వస్తున్న మూవీ కావడంతో బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కావడం ఖాయమని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు.