Pawan Kalyan| కాకినాడ పోర్టు(Kakinda Port) నుంచి అక్రమ రేషన్ బియ్యం రవాణా జరుగుతుండటంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకినాడ పోర్టు నుంచి అక్రమంగా రవాణా చేస్తుండగా సీజ్ చేసిన 640 టన్నుల పీడీఎస్ బియ్యాన్ని పవన్ స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా పోర్టులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై మండిపడ్డారు. ఇలాంటి ఘటనలను పట్టించుకోవాలి కదా? అంటూ స్థానిక టీడీపీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు సీరియస్ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కాకినాడ పోర్టును స్మగ్లింగ్ హబ్‌గా మార్చారని ఫైరమ్ అయ్యారు.
‘‘మంత్రి నాదెండ్ల మనోహర్ పలు చోట్ల తనిఖీలు నిర్వహించి 51వేల టన్నుల రేషన్ బియ్యం పట్టుకున్నారు. కాకినాడ పోర్టుకు రోజుకు వెయ్యి నుంచి 1100 లారీలు వస్తాయి. ప్రపంచంలోని వివిధ దేశాలకు బియ్యం ఎగుమతి చేసే పోర్టుల్లో కాకినాడ చాలా ముఖ్యమైంది. కానీ ఇక్కడ భద్రతా సిబ్బంది కేవలం 16 మంది మాత్రమే. మంత్రి వచ్చి తనిఖీలు చేసినా స్థానిక అధికారులు మాత్రం సీరియస్‌గా తీసుకోవడం లేదు. కాకినాడ పోర్టు నుంచి అక్రమాలు జరిగేందుకు వీల్లేదు. బియ్యం అక్రమ రవాణాకు డీప్ నెట్ వర్క్ పనిచేస్తోంది’’ అని తెలిపారు.
“దీనిపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు రిపోర్ట్ పంపుతున్నాను. దీనిపై డీజీపీ తక్షణమే చర్యలు తీసుకోవాలి. ప్రైవేటు షిప్ అయితే వదిలేస్తారా? ఎన్నాళ్ల నుంచి ఈ షిప్ ఆపరేట్ చేస్తున్నారు? మాట్లాడితే 10 వేల మంది జీవితాలు పోతాయంటారు. ఎన్నిసార్లు అడిగినా, వద్దు రావద్దు అంటారు. నేను వచ్చే టైంకి ఎస్పీ కనిపించరు. సెలవు పెడతారు. రేషన్ బియ్యమే కాకుండా డ్రగ్స్, ఆర్డీఎక్స్ లాంటివి స్మగ్లింగ్ అయితే ఎవరు బాధ్యులు..?కసబ్ లాంటి తీవ్రవాదులు వస్తే ఎవరు బాధ్యులు. మన ఎమ్మెల్యేలను కూడా అడుగుతున్నా. పొలిటికల్ ప్రెజర్స్ అంటూ దేశ భద్రతకు తూట్లు పొడుస్తారా? ఏదైనా జరగకూడనిది జరిగితే ఎవరు బాధ్యులు? పాకిస్థాన్ ఉగ్రవాదులు దాడులకు పాల్పడితే ఎంత ప్రమాదకరమో తెలుసా? ముంబైలో ఎంత మంది ప్రాణాలు కోల్పోయారో తెలుసా?” అంటూ పవన్ కళ్యాణ్ నిలదీశారు.