Pawan Kalyan| గత వైసీపీ ప్రభుత్వంలో సరస్వతి పవర్ భూముల రైతులకు న్యాయం జరగలేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. పల్నాడు జిల్లా మాచవరం మండలం వేమవరం, చెన్నాయపాలెంలోని సరస్వతి పవర్ భూములను స్థానిక ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుతో కలిసి పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రజల ఆస్తులు లాక్కొని.. తమ సొంత ఆస్తిలా జగన్ కుటుంబ సభ్యులు కొట్లాడుకుంటున్నారని విమర్శించారు. సరస్వతీ పవర్ ప్లాంట్ కోసం వైసీపీ అధినేత జగన్ సొంతంగా భూములు తీసుకున్నారని తెలిపారు. 2009లో వైఎస్‌ఆర్ సీఎంగా ఉన్నప్పుడు 30 ఏళ్లు లీజుకు తీసుకోగా.. జగన్ సీఎం అయిన తర్వాత ఆ లీజును మరో 50 ఏళ్లు పొడిగించుకున్నారని పేర్కొన్నారు. కానీ ఆ రోజు నుంచి ఇవాళ్టి వరకు ప్రాజెక్టు కార్యరూపం దాల్చలేదని మండిపడ్డారు.
తమ కూటమి ప్రభుత్వం మెతక వైఖరీతో లేదని చెప్పడానికే ఇక్కడికి వచ్చానని హెచ్చరించారు. వైసీపీ ప్రభుత్వంలో భూములిచ్చిన రైతుల పిల్లలకు ఉద్యోగాలు ఇస్తామని భూములు తీసుకున్నారని.. భూములు ఇవ్వబోమన్న వారిపై పెట్రోల్ బాంబులు వేసి వేధించారని ధ్వజమెత్తారు. మరి ఇన్నేళ్లయినా రైతులకు పరిహారం ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. సిమెంట్ ఫ్యాక్టరీ అంటే అనుమతి ఇవ్వరనే కారణంతో వైఎస్‌ఆర్ హయాంలో పవర్ ప్రాజెక్ట్ అని చెప్పి భూములు స్వాధీనం చేసుకున్నారని ఆరోపించారు. ఈ భూములపై అనేక అనుమానాలు ఉన్నాయని అందుకే విచారణకు ఆదేశించామని వెల్లడించారు.
రూ.20లక్షల ఫర్నిచర్ కోసం మాజీ స్పీకర్ కోడెలను వేధించారని ఫైర్ అయ్యారు. అలాంటి వ్యక్తులు పేదల భూముల లాక్కొని మోసం చేశారని దుయ్యబట్టారు. 1,384 ఎకరాల్లో 24 ఎకరాల అసైన్డ్ భూమి ఉందన్నారు. ఇంత చేసినా ఇంతవరకు ఫ్యాక్టరీ పెట్టలేదన్నారు. అటవీ భూములను కూడా రెవెన్యూ భూములుగా మార్చారన్నారు. భూములిచ్చిన రైతులకు అండగా ఉంటామని భరోసా ఇస్తున్నట్లు పవన్ స్పష్టంచేశారు. వైసీపీ నేతలు ఇంకా అధికారంలో ఉన్నట్లు ప్రవర్తిస్తున్నారని.. ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదని వార్నింగ్ ఇచ్చారు.