సముద్రంలో చేపల వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు అందించే ఆర్థిక భృతిని రూ. 20,000కు పెంచడంపై సీఎం చంద్రబాబుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ధన్యవాదాలు తెలిపారు. ఈమేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
“మత్స్యకారులకు ఇచ్చిన మాట కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంది.రాష్ట్రంలో మత్స్యకారుల వలసలు తగ్గించే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందని, సముద్రంలో చేపల వేట నిషేధ సమయంలో ఇచ్చే భృతిని రెట్టింపు చేస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంది. మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో ఇచ్చే భృతిని రూ. 10,000 నుంచి రూ.20,000 పెంచాము. మత్స్యకారుల సేవ పథకం ద్వారా ఈ మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేస్తున్నాము.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1,29,178 మత్స్యకార కుటుంబాలకు రూ.259 కోట్ల లబ్ధి చేకూరుతోంది. చేపల వేటపై ఆధారపడ్డ కష్ట జీవులకి ఈ రెండు నెలలు జీవనానికి ఎలాంటి సమస్య రాకుండా చేసే దిశగా ఎన్నికల మేనిఫెస్టో రూపకల్పన దశలోనే చర్చించడం జరిగింది. ఎన్నికల హామీ కార్యరూపం దాల్చేలా చేసిన ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. జీవన భృతి ఇచ్చి ఆదుకోవడం మాత్రమే కాదు వలసలు వెళ్తున్న మత్స్యకారులకు ఇక్కడే తగిన ఉపాధి చూపించే ఆలోచనలు కూటమి ప్రభుత్వం చేస్తుంది. సుదీర్ఘ సముద్ర తీరం ఉన్న మన రాష్ట్రంలో, తీర ప్రాంత అభివృద్ధి ద్వారా మత్స్యకార కుటుంబాలకు భరోసా కల్పించే దిశగా అడుగులు వేస్తాము.” అని పేర్కొన్నారు.