తిరుపతిలో తొక్కిసలాట(Tirupati Stampede) జరిగిన ప్రాంతాన్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) పరిశీలించారు. గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి వచ్చిన ఆయన అక్కడి నుంచి నేరుగా తిరుపతి వచ్చారు. అనంతరం బైరాగిపట్టెడ వద్ద ఘటనాస్థలాన్ని పరిశీలించి అధికారులతో మాట్లాడారు. ఘటనకు గల కారణాలు, టోకెన్ల జారీలో భద్రతా ఏర్పాట్లు , బాధితులకు అందిస్తున్న సహాయ కార్యక్రమాలు గురించి అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా భక్తులను ఎందుకు ఒకేసారి క్యూలైన్లలోకి వదిలారని పవన్ ప్రశ్నించారు. హైవేకు దగ్గరగా ఉండటంతో భక్తులు పెద్ద సంఖ్యలో పద్మావతి పార్క్‌కు వచ్చారని అధికారులు వివరించారు. అనంతరం స్విమ్స్, రుయా ఆసుపత్రులకు వెళ్లి క్షతగాత్రులను పరామర్శిచి ధైర్యం చెప్పారు. కాగా పవన్ వెంట తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, జనసేన నేతలు కిరణ్ రాయల్, పసుపులేటి, టీటీడీ బోర్డ్ మెంబర్ ఆనంద్‌సాయి ఉన్నారు. అంతకుముందు బాధితులను సీఎం చంద్రబాబు పరామర్శించిన సంగతి తెలిసిందే.