వైసీపీ(YCP) నేతలకు కడపలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) వార్నింగ్ ఇచ్చారు. అధికారులపై దాడి చేస్తే వదిలేది లేదని వైసీపీ నేతల కళ్ళు కిందకి దించుతానంటూ హెచ్చరించారు. వైసీపీ నేతల దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న గాలివీడు ఎంపీడీవో జవహర్‌బాబును కడప రిమ్స్‌లో ఆయన పరామర్శించారు. బాధితుడి కుటుంబ సభ్యులతో అప్యాయంగా మాట్లాడారు. జవహర్ బాబుకు అందిస్తున్న చికిత్సపై వైద్యులను అడిగి తెలుసుకుని మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. తామంతా అండగా ఉంటామని.. త్వరగా కోలుకుని విధులకు హాజరుకావాలని జవహర్ బాబుకు ధైర్యం చెప్పారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ..అధికారులపై దాడులు చేస్తే గత ప్రభుత్వం లాగా వదిలేది లేదన్నారు. విధులకు ఆటంకం కలిగిస్తే ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. దాడిపై అన్నమయ్య జిల్లా కలెక్టర్ స్పందించిన తీరు హర్షణీయం అన్నారు. తప్పు చేస్తే ఎంతటి వారినైనా తమ ప్రభుత్వంలో వదిలేది లేదని స్పష్టం చేశారు. కాగా ఎంపీపీ కార్యాలయం తాళం విషయంలో వైసీపీ నాయకులు రెచ్చిపోయి గాలివీడు ఎంపీడీవో జవహర్ బాబుపై మూకుమ్మడిగా దాడి చేసిన సంగతి తెలిసిందే.