ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ ఇటీవల సింగపూర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడిన విషయం తెలిసిందే. అక్కడి ఓ స్కూల్లో జరిగిన ఈ ఘటనలో గాయాల పాలైన మార్క్ శంకర్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ఘటన నేపథ్యంలో పవన్ కళ్యాణ్, ఆయన సతీమణి అన్నా లెజనీ సింగపూర్‌కి వెళ్లి తమ కుమారుడిని చూసి, వైద్య సహాయంపై సమీక్షించారు. తాజా సమాచారం ప్రకారం, మార్క్ శంకర్ పూర్తిగా కోలుకుంటున్నాడని, ఆయన తండ్రి పవన్ స్వయంగా వెల్లడించారు.
ఈ రోజు ఉదయం పవన్ కళ్యాణ్ దంపతులు మార్క్ శంకర్‌తో కలిసి భారత్‌కు తిరిగొచ్చారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ ద్వారా స్పందించారు. తన కుమారుడిపై ప్రేమాభిమానాలు చూపిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. మీ మెసేజ్‌లు, ప్రార్థనలు మాకు గొప్ప బలాన్నిచ్చాయన్నారు. ప్రత్యేకంగా, ఈ సమయంలో స్పందించిన ప్రధాని మోదీ గారికి ధన్యవాదాలు తెలిపారు. ఆయన ప్రోత్సాహం తమకు ధైర్యాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు.
ఆదివాసీ ప్రాంతాల్లో పర్యటనలో ఉన్నపుడు ఈ వార్త తెలిసిందని వెల్లడించిన పవన్ కళ్యాణ్, ప్రధాని మోదీ అడవి తల్లి బాట లో తీసుకుంటున్న చర్యలను ప్రశంసించారు. “PM JANMAN, PMGSY, MGNREGS సహకారంతో రూ.1005 కోట్ల వ్యయంతో 1069 కి.మీ. రోడ్లు నిర్మాణం జరుగుతోంది. 601 ఆదివాసీ ప్రాంతాలకు రోడ్డు మార్గం అందుబాటులోకి వస్తుందని తెలిపారు. డోలీలలో ప్రయాణించే కష్టాల నుంచి ఆదివాసీలకు కలిగే మార్గాలు అందుబాటులోకి వస్తున్నాయని తెలిపారు.