ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన చిన్న కుమారుడు మార్క్ శంకర్‌కు జరిగిన అగ్ని ప్రమాదంపై… తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అరకు లోక్‌సభ నియోజకవర్గంలో పర్యటనలో ఉన్న సమయంలో ఈ దుర్వార్త తెలిసిందని పవన్ తెలిపారు. ఉదయం 7:30 సమయంలో భార్య ఫోన్ చేశారని.. మార్క్ శంకర్ సింగపూర్‌లోని సమ్మర్ క్యాంప్‌లో ఉన్నాడని పేర్కొన్నారు. అక్కడ అగ్ని ప్రమాదం జరిగిందని చెప్పారు. మొదట చిన్న విషయం అనుకున్నా అని.. అయితే తర్వాత సమాచారం పూర్తిగా తెలుసుకున్నాక ఆందోళన చెందినట్లు పవన్ తెలిపారు.
ప్రమాద సమయంలో మార్క్ శంకర్ చేతులు, కాళ్లకు గాయాలు అయినట్లు, ముఖ్యంగా ఊపిరితిత్తుల్లోకి పొగ చొచ్చుకుపోయిందని పవన్ వివరించారు. ప్రస్తుతానికి ఆసుపత్రిలో నిపుణుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నాడని వివరించారు. బ్రాంకోస్కోపీ వంటి వైద్య పరీక్షలు చేస్తున్నారు. త్వరగా కోలుకోవడానికి కొంత సమయం పడే అవకాశం ఉందన్నారు. ఇక ఇది యాధృచ్ఛిక ప్రమాదమన్న పవన్. మా కుమారుడు కోలుకుంటున్నాడని తెలిపారు. మీరు అందరూ చూపిన ప్రేమ, ఆప్యాయత, ప్రార్థనలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అని పవన్ ఒక ప్రెస్ నోట్‌లో తెలిపారు.
ఈ ఘటనలో మరో చిన్నారి ప్రాణాలు కోల్పోవడం హృదయవిదారకమని అన్నారు. మొత్తం 30 మంది పిల్లలు సమ్మర్ క్యాంప్‌లో పాల్గొన్నట్లు తెలుస్తోంది.
ప్రమాదం జరిగిన వెంటనే ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఫోన్ చేసి పూర్తి వివరాలు అడిగారని పవన్ తెలిపారు. సింగపూర్‌లోని ఇండియన్ హైకమిషన్‌తోనూ సంప్రదించారు. ఇతర రాజకీయ నేతలు చంద్రబాబు, లోకేష్, జగన్, కేటీఆర్, బండి సంజయ్, కిషన్ రెడ్డి తదితరులు ఫోన్ ద్వారా పరామర్శించారని తెలిపారు. అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సంఘటన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తన అరకు పర్యటనను తక్షణం రద్దు చేసుకున్నారు. హైదరాబాదుకు చేరుకున్న ఆయన, కుటుంబ సభ్యులతో కలిసి సింగపూర్ వెళ్లే ఏర్పాట్లు చేస్తున్నారు. చిరంజీవి కుటుంబం కూడా ఆయనతో పాటు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ సంఘటన అకీరా నందన్ పుట్టినరోజున జరగడం తండ్రిగా ఎంతో బాధ కలిగించిందని పవన్ అన్నారు. తనయుడి ఆరోగ్యం కోలుకోవాలని అభిమానులు, కార్యకర్తలు చేస్తున్న ప్రార్థనలు తమకు మానసికంగా బలం ఇస్తున్నాయని తెలిపారు.