విద్యుత్ రంగాన్ని గాడిలో పెట్టేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాల ఫలితంగా 2022– 23 ఆర్థిక సంవత్సరంలో ఏపీజెన్‌కో రూ. 33 కోట్ల నికర లాభాలను ఆర్జించిందని రాష్ట్ర ఇంధన, అటవీ, పర్యావరణం శాస్త్ర సాంకేతిక, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు.
2) అనేక ఇబ్బందులను అ«ధిగమనించి ఏపీజెన్‌కోను లాభాలబాటలోకి తెచ్చినందుకు అధికారులను ఆయన అభినందించారు. ఏపీజెన్‌కో, నెడ్‌క్యాప్ పనితీరుపై గురువారం సచివాలయంలోని కాన్ఫరెన్సు హాలులో మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…
3) ఎన్‌హెచ్‌పీసీ, ఏపీజెన్‌కో సంయుక్తంగా రాష్ట్రంలో 5000 మెగావాట్ల సామర్థ్యంతో పంప్డ్ స్టోరేజి ప్రాజెక్టులు (పీఎస్‌పీ) నిర్మాణానికి ఈనెల రెండో వారంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకోనున్నాయి. ఈ ప్రాజెకుల్ట నిర్మాణ పనులను త్వరితగతిన ప్రారంభించి పూర్తి చేసేందుకు రెండు సంస్థలు పకడ్బందీ కార్యాచరణ ప్రణాళికతో ముందుకెళ్లాలి.
4) ఫ్లైయాష్ నిర్వహణ, విక్రయాలకు సంబంధించి పకడ్బందీ కార్యాచరణ ప్రణాళిక రూపొందించి పక్కాగా అమలు చేయాలి. బాటమ్‌యాష్ కు మార్కెట్‌లో డిమాండు పెరిగిన నేపథ్యంలో ఏపీజెన్‌కోకు ఆదాయం పెరిగేలా విధాన నిర్ణయం తీసుకుని అమలు చేయాలి.
5) ఏపీజెన్‌కో విద్యుత్ ఉత్పత్తి పెంచారు, అలాగే ఇంధన ఉత్పత్తి వ్యయం తగ్గింపుపై కూడా ప్రధానంగా దృష్టిపెట్టాలి. మరీ ముఖ్యంగా ఆర్టీపీపీలో ఆగ్జిలరీ వినియోగం చాలా ఎక్కువగా ఉంది. దీనిని సాధ్యమైనంతవరకూ తగ్గించాలి. అవుటేజెస్ తగ్గించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలి.
6) వర్షాలవల్ల గనుల్లో బొగ్గు తవ్వకాలకు అంతరాయాలు ఏర్పడే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని వర్షాకాలంలో బొగ్గు కొరత ఏర్పడకుండా ముందస్తుగా నిల్వలు ఉంచుకునేందుకు అన్ని విధాలా జాగ్రత్తలు తీసుకోవాలి. పదిరోజులకు సరిపడా బొగ్గు నిల్వలను ప్లాంట్లలో సిద్ధంగా ఉంచుకోవాలి.
7) విశాఖలో జరిగిన పెట్టుబడుల సదస్సులో చేసుకున్న ఒప్పందాలన్నీ అతి త్వరగా కార్యరూపం దాల్చేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించి ముందుకెళ్లాలి. అనంతపురం, వైఎస్సార్ జిల్లాల్లో ప్రభుత్వ భూమి అందుబాటులో ఉన్నందున అక్కడ సోలార్, విండ్ ప్రాజెక్టుల ఏర్పాటుకు త్వరితగతిన చర్యలు తీసుకోవాలి.
ఎంఓయూలు కుదుర్చుకున్న సంస్థలతో సమన్వయం చేసుకుని త్వరితగతిన అన్ని రకాల అనుమతులు తీసుకుని పనులు ప్రారంభించేలా చూడాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన సంస్థల నుంచి చట్టబద్ధమైన అనుమతులు త్వరగా తీసుకునేందుకు నైపుణ్యం, అనుభవం ఉన్న కన్సల్టెన్సీలను వినియోగించుకోవాలి. అటవీ శాఖ నుంచి మొదటి దశ అనుమతులు తీసుకుని ప్రత్యామ్నాయ వనీకరణ కింద ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడ భూములు అటవీశాఖకు కేటాయించి రెండోదశ అనుమతులు తీసుకోవాలి.
8) డాక్టర్ నార్లతాతావు థర్మల్ విద్యుత్ కేంద్రం, ఆర్టీపీపీ యూనిట్లు చాలా పాతవని, అందువల్ల విద్యుత్ ఉత్పత్తి వ్యయం కొంత ఎక్కువగా ఉందని, అయినప్పటికీ సాధ్యమైనంత తగ్గించడానికి ప్రయత్నిస్తామని ఇంధన శాఖ స్పెషల్ సీఎస్, ఏపీజెన్‌కో ఛైర్మన్ విజయానంద్, ఏపీజెన్‌కో మేనేజింగ్ డైరెక్టర్ కేవీఎన్ చక్రధర్ బాబు మంత్రికి వివరించారు. ఆర్టీపీపీకి బొగ్గు రవాణా వ్యయం ఎక్కువగా ఉండటం కూడా ఉత్పత్తి వ్యయం పెరగడానికి కారణమవుతోందని వివరించారు.
ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో 112 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను సరఫరా చేసిన ఘనత ఏపీజెన్‌కో సాధించిందని, ఇందుకు సహకారం అందించినందుకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారికి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, స్పెషల్ సీఎస్ విజయానంద్ గారికి ఏపీజెన్‌కో ఎండీ «చక్రధర్ బాబు దన్యవాదాలు తెలిపారు.
9) ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, ఏపీజెన్‌కో మేనేజింగ్ డైరెక్టర్ కేవీఎన్ చక్రధర్ బాబు, ఇంధన శాఖ జాయింట్ డైరెక్టరు కుమార్ రెడ్డి, నెడ్‌క్యాప్ ఎండీ రమణారెడ్డి, ఏపీజెన్‌కో డైరెక్టర్లు బి. వెంకటేశులు రెడ్డి (ఫైనాన్స్), మహమ్మద్ రఫి (హెచ్‌ఆర్), చంద్రశేఖర్ రావు (థర్మల్), ఆంటోనీరాజ్ (కోల్), సత్యనారాయణ (హైడల్), చీఫ్ ఇంజినీర్లు, ఇతర ఉన్నతాధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.