ఆగస్టు 1 నుంచి రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టులను సందర్శించాలని మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు అయిన ఎన్. చంద్రబాబు నాయుడు నిర్ణయించుకున్నారు. ఈ ప్రాజెక్టుల నిర్మాణాన్ని పూర్తి చేయడంలో వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలను బయటపెట్టాలని ఆయన భావిస్తున్నారు. ఆగస్టు 1 నుంచి 10 వరకు ఆయన పోలవరం ప్రాజెక్టుతో సహా రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు రాష్ట్రంలోని వివిధ సాగునీటి ప్రాజెక్టుల ప్రాంతాలలో పర్యటిస్తారు.
ఆయన ఆగస్టు 1న ఉమ్మడి కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలోని ముచ్చుమర్రి ప్రాజెక్టును ముందుగా సందర్శిస్తారు. అక్కడి నుంచి ఆయన తన పర్యటనను ప్రారంభించడం జరుగుతుంది. ఆ తర్వాత ఆయన కడప జిల్లాలోని గండికోట ప్రాజెక్టును, అనంతపురం, చిత్తూరు జిల్లాలలోని ఇతర ప్రాజెక్టులను, ప్రకాశం జిల్లాలోని గుండ్లకమ్మ ప్రాజెక్టును, కోస్తా ఆంధ్ర జిల్లాలలోని పోలవరం తదితర ప్రాజెక్టులను సందర్శించడం జరుగుతుంది. ఈ పర్యటనల సందర్భంగా చంద్రబాబు ఆయా ప్రాజెక్టుల సమీపంలోని రైతులతో సమావేశం అవుతారు.
ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి అసమర్థత, నిర్లక్ష్యాల వల్ల గత నాలుగేళ్ల కాలంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం ఏవిధంగా కుంటుపడిందీ చంద్రబాబు వివరాలతో సహా సేకరిస్తారని, ఆ వివరాలను ప్రజల ముందు బయటపెడతారని తెలిపారు. నిజానికి, నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణంలో జగన్ ప్రభుత్వ వైఫల్యాల గురించి కొంత మేరకు ఆయన ఇప్పటికే ప్రజల ముందు వెల్లడించామని అచ్చెంనాయుడు తెలియజేశారు.
‘‘నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో చంద్రబాబు లేవనెత్తిన అంశాలకు జవాబు చెప్పకపోగా, నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘ఇసుక మేట కూడా తీయలేకపోతున్న అంబటి రాంబాబు నీటిపారుదల ప్రాజెక్టుల గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది. ఆయనను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు‘‘ అని అచ్చెంనాయుడు అన్నారు. రాష్ట్ర ప్రగతి, అభివృద్ధి కంటే జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రాన్ని దోచుకోవడం, హత్యా రాజకీయాలు, ఎదురుదాడులే ముఖ్యమనే విషయం రాష్ట్ర ప్రజలకు ఎప్పుడో అర్థమైపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. తన అసమర్థత, అయోగ్యతలతో జగన్ ఇప్పటికే రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టులను, వ్యవసాయ రంగాన్ని అతి దారుణంగా భ్రష్టు పట్టించారని అచ్చెంనాయుడు విమర్శించారు.
ఈ దురదృష్టకర పరిస్థితిని సాక్ష్యాధారాలతో ప్రజల ముందుంచడానికే చంద్రబాబు ఆగస్టు 1 నుంచి పర్యటన చేపడుతున్నారని ఆయన తెలిపారు. జగన్ ప్రభుత్వ అవివేకపు చర్యల కారణంగా రైతులు వ్యవసాయాన్ని వదిలి పెట్టి వెళ్లిపోయే పరిస్థితి ఏర్పడిందని, రైతులు, వ్యవసాయం ఇప్పటికే వెంటిలేటర్ మీద ఉన్నాయని, వారికి అండగా నిలబడడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నదేమీ లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో జగన్ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలోకి విసిరేయాలని ప్రజలు ఏనాడో నిర్ణయానికి వచ్చానని ఆయన వ్యాఖ్యానించారు.