Wednesday, October 30, 2024
Homeఆంధ్రప్రదేశ్Pensions in AP: ఒకటి రెండు రోజుల్లోనే పింఛన్ల పంపిణీ పూర్తి చేయాలి

Pensions in AP: ఒకటి రెండు రోజుల్లోనే పింఛన్ల పంపిణీ పూర్తి చేయాలి

సచివాలయ ఉద్యోగులంతా పింఛన్ల పంపిణీలో పాల్గొనాలి

జూలై ఒకటోతేదీన జరిగే పింఛన్ల పంపిణీలో ఎలాంటి జాప్యం జరగడానికి వీల్లేదని గ్రామ, వార్డు సచివాలయ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. రాష్ట్ర సచివాలయంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన వెంటనే ఆ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సచివాలయ ఉద్యోగులంతా పింఛన్ల పంపిణీలో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

- Advertisement -

ఇప్పటిదాక లక్షా 9వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు సరే.. రాజీనామా చేసి కూడా సెల్ ఫోన్లు, సిమ్‌ కార్డులు స్వాధీనం చేయని వారి సంగతేంటని ప్రశ్నించారు. అలాంటి వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

చాలాచోట్ల గ్రామ, వార్డు సచివాలయ భవనాలు ఊరికి దూరంగా, ప్రజలకు ఏవిధంగానూ అందుబాటులో లేకుండా ఉండటంతో అవన్నీ అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారాయని, అలాంటి వాటిపై వెంటనే సమగ్ర నివేదిక ఇవ్వాలని మంత్రి డా. డోలా బాల వీరాంజనేయ స్వామి అధికారులను కోరారు.

గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగులందరి సెలవుల మంజూరుపై ఒక కచ్చితమైన విధానాన్ని రూపొందించాలని చెప్పారు. సచివాలయాలు జారీ చేసే సర్టిఫికెట్లు, ఇతర సర్వీసు పత్రాలపై పాత లోగోలు లేకుండా జాగ్రత్త పడాలని ఈ విషయంలో ఎక్కడైనా అలసత్వం వహించినట్టు తెలిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే సచివాలయ భవనాల మీద గత ప్రభుత్వ లోగోలు, ఫోటోలు తొలగించి వాటి స్థానంలో రాష్ట్ర ప్రభుత్వ చిహ్నాన్ని ఉంచాలని సూచించారు.

రాష్ట్రంలో చాలా చోట్ల గ్రామ సచివాలయాలకు, పంచాయితీలకు మధ్య సమన్వయం లేదని మంత్రి అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం ఇతర శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులను సైతం సంప్రదించి అవసరమైతే ఒక కమిటీ వేసుకుని సమన్వయాన్ని సాధించాలని కోరారు.

గ్రామ, వార్డు సచివాలయాల రోజు వారి వ్యవహారాలను పరిశీలించేలా మండల స్థాయిలోనే ఒక అధికారికి బాధ్యతలు అప్పజెప్పే దిశగా కూడా ఆలోచనలు చేయాలని మంత్రి ఆదేశించారు. రక్త హీనత, పోహక ఆహార లోపం, బడి బయటి పిల్లలు, పాఠశాలల్లో మౌలిక వసతులు వంటి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై దృష్టి పెట్టి పురోగతి సాధించాలని కూడా ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ, వార్డు సచివాలయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌ జైన్‌ గారు, ప్రత్యేక కార్యదర్శి మహమ్మద్‌ దివాన్‌ మైదీన్‌ గారు, డైరెక్టర్‌ శివప్రసాద్‌ గారు రాష్ట్రంలోని సచివాలయాల ప్రస్తుత పరిస్థితి మీద రూపొందించిన సమగ్ర సమాచార నివేదికను మంత్రికి సమర్పించారు. ఇంకా ఈ కార్యక్రమంలో అడిషనల్‌ డైరెక్టర్‌ డా. అభిశేక్‌ గౌడ ఇతర అధికారులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News