గత ఐదేళ్లు వైసీపీ ప్రభుత్వం మూడు ముక్కలాట ఆడి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిందని సీఎం చంద్రబాబు(CM Chandrababu) విమర్శించారు. పల్నాడు జిల్లా యల్లమందలో పింఛన్ల పంపిణీలో పాల్గొన్న ఆయన ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐదు కోట్ల మంది ప్రజల కోసమే ప్రతి క్షణం తాను కష్టపడుతున్నానన్నారు. తనకు హైకమాండ్ ఎవరూ లేరని.. ఐదు కోట్ల మంది ప్రజలే తనకు హైకమాండ్ అని తెలిపారు. గత ఐదేళ్లు ప్రజలు బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొందని.. కనీసం నవ్వలేకపోయారని చెప్పారు. ఇప్పుడు ఇంటింటికీ వచ్చి పింఛన్లు అందిస్తున్నామన్నారు.
పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచన చేస్తున్నామన్నారు. ఉన్నత చదువులు పూర్తయిన యువతకు ఉద్యోగాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వంలో రాజధాని లేకుండా ఐదేళ్లు కాలయాపన చేశారని.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమరావతిని పరుగులు పెట్టిస్తున్నామని చెప్పుకొచ్చారు. తెలుగు తల్లికి జలహారతి కార్యక్రమం ద్వారా రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తామని అన్నారు. పోలవరం నుంచి బనకచర్లకు నీళ్లను తరలిస్తామని మాటిచ్చారు. పార్టీ కోసం పనిచేసిన వారిని ఎప్పటికీ మరిచిపోలేమని కార్యకర్తలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని చంద్రబాబు వెల్లడించారు.