Perni Nani On Jagan Padayathra: వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 2029 ఎన్నికల్లో గెలుపే లక్ష్యమని చెప్పారు. తమ పార్టీ అధినేత జగన్ అనుసరించబోయే వ్యూహాన్ని వెల్లడించారు. 2027లో పార్టీ ప్లీనరీ సమావేశం ముగిసిన వెంటనే జగన్ రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున పాదయాత్ర చేపడతారని ఆయన స్పష్టం చేశారు. 2029 ఎన్నికలు ఒక ‘టగ్ ఆఫ్ వార్’లాంటిదని, దానికి సిద్ధమయ్యేందుకే ఈ పాదయాత్ర అని ఆయన వివరించారు.
కొత్త సమస్యల అధ్యయనానికే పాదయాత్ర
2019 ఎన్నికలకు ముందు జగన్ చేపట్టిన పాదయాత్ర, నవరత్నాలు అనే శక్తివంతమైన మేనిఫెస్టో రూపకల్పనకు ఉపయోగపడిందని గుర్తు చేశారు. ఇదే తరహాలో రాబోయే పాదయాత్ర ఉద్దేశాన్ని కూడా ఆయన వివరించారు. కూటమి ప్రభుత్వ పాలనలో సమాజంలో వచ్చిన మార్పులు, ప్రజలు ఎదుర్కొంటున్న కొత్త సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకే జగన్ మళ్లీ పాదయాత్ర చేయనున్నట్లు తెలిపారు. కాలంతో పాటు ప్రజల సమస్యలు, ఆలోచన విధానం మారుతుందని, వాటికి తగ్గట్లుగా నాయకులు మారాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ యాత్ర ద్వారా కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందు ఎండగతామన్నారు.
మా పాలనా వైఫల్యాలను అంగీకరిస్తున్నాం
భవిష్యత్ ప్రణాళికలను వివరిస్తూనే, 2024 ఎన్నికల ఓటమికి దారితీసిన పాలనాపరమైన లోపాలను ఆయన నిక్కచ్చిగా అంగీకరించారు. ముఖ్యంగా, ఎమ్మెల్యేలను కూడా కలవనీయకుండా సీఎంఓలో కొంతమంది అతి చేయడం వల్ల నెగెటివ్ ఇంపాక్ట్ పడిందని అంగీకరించారు. ఒక ప్రభుత్వం విజయవంతం కావాలంటే, నాయకుడి చుట్టూ ఉన్న సిబ్బంది క్షేత్రస్థాయిలో ప్రజాప్రతినిధుల పనులకు అడ్డుపడకూడదన్నారు. ప్రజా ప్రతినిధులకు సహకరించినప్పుడే సమస్యలు తీరుతాయన్నారు. గతంలో జరిగిన ఈ పాలనాపరమైన పొరపాట్లను సరిదిద్దుకుంటూ, 2029లో తిరిగి అధికారంలోకి రావడానికి కృషి చేస్తామన్నారు.
2029 ప్రచార యుద్ధానికి సై..
ప్రస్తుత అధికార కూటమి చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టడం కూడా రోడ్‌మ్యాప్‌లో ఒక ముఖ్యమైన భాగంగా పేర్కొన్నారు. తమ ప్రభుత్వం సచివాలయ, వాలంటీర్ల వ్యవస్థ ద్వారా సంక్షేమ ఫలాలను ప్రజలకు అందించడంపై దృష్టి పెట్టిందన్నారు. ఈ సమయంలో వైసీపీ సోషల్ మీడియా విభాగం కొంత డ్యామేజ్ చేసిందని నాని అంగీకరించారు. ఇదే అదునుగా ప్రత్యర్థి మీడియా వర్గాలు తమపై విష ప్రచారం చేశాయని, అది కూడా ఓటమికి ఒక ప్రధాన కారణమన్నారు. అందుకే ఇప్పుడు కూలీల నుంచి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల వరకు పార్టీ మద్దతుదారులందరినీ తిరిగి యాక్టివేట్ చేసి, సోషల్ మీడియాలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామన్నారు.

