Pink Diamond Controversy : తిరుమలలో శ్రీవారి ఆభరణాలపై గత కొన్నేళ్లుగా కొనసాగుతున్న పింక్ డైమండ్ వివాదానికి తాజాగా స్పష్టత వచ్చింది. ఎన్నో వాదనలు, ఆరోపణలు జరిగిన ఈ అంశంపై ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) అధికారికంగా తేల్చిచెప్పింది. శ్రీవారి హారంలో ఉన్న రాయి ఎప్పుడూ పింక్ డైమండ్ కాదు, అది ఒక సాధారణ కెంపు రాయి మాత్రమేనని వారి పరిశోధనలో తేలిపోయింది.
పింక్ డైమండ్…`
ఈ వివాదం మొదటిసారి 2018లో వెలుగులోకి వచ్చింది. అప్పుడు తిరుమల ఆలయ ప్రధాన అర్చకులుగా ఉన్న రమణదీక్షితులు ఒక సంచలన వ్యాఖ్య చేశారు. మైసూరు మహారాజు శ్రీవారికి సమర్పించిన హారంలో ఉన్న రాయి కోట్ల విలువైన పింక్ డైమండ్ అని, అది తరువాత దొంగిలించబడి విదేశాల్లో అమ్మడం జరిగిందని ఆయన ఆరోపించారు. ఈ ప్రకటన పెద్ద సంచలనాన్ని రేపింది. కానీ వెంటనే టీటీడీ ఈ ఆరోపణలను ఖండిస్తూ, హారంలో ఉన్నది కేవలం కెంపు రాయి మాత్రమేనని ప్రకటించింది.
మైసూరు ప్యాలెస్ రికార్డులు..
అయితే వివాదం ఆగకుండా కొనసాగింది. భక్తులు, మీడియా, రాజకీయ నాయకులు అందరూ దీనిపై చర్చించగా, పరిస్థితి మరింత ఉద్రిక్తమైంది. ఈ నేపథ్యంలో ఇటీవల ASI డైరెక్టర్ మునిరత్నం రెడ్డి సమగ్ర పరిశోధన చేపట్టారు. ఆయన మైసూరు ప్యాలెస్ రికార్డులు, ఆభరణాల పాత వివరాలు అన్ని పరిశీలించారు. అంతేకాక మైసూరు మహారాణి ప్రమోద దేవిని కలసి హారం గురించిన చారిత్రక వివరాలను సేకరించారు. ఈ పరిశోధనల్లో తేలినది ఏమిటంటే ఆ హారం ఢిల్లీలోని ఒక ఆభరణాల షాపులో కేవలం 8,500 రూపాయలకే తయారు చేశారు. అందులో డైమండ్ ఏదీ లేదు, కేవలం కెంపు రాయే వాడారు.
ఆరోపణలు పూర్తిగా..
ప్యాలెస్ ఆర్కైవ్‌లో కూడా స్పష్టమైన రికార్డులు లభించాయి. అందులో ఆభరణం విలువలు, తయారీ వివరాలు అన్ని నమోదు అయ్యాయి. పింక్ డైమండ్ అని ఎక్కడా ఎలాంటి సూచన లేదు. రమణదీక్షితులు చేసిన ఆరోపణలు పూర్తిగా వాస్తవానికి విరుద్ధమని మునిరత్నం రెడ్డి తేల్చారు. ఈ సందర్భంగా ఆయన ఆలయాల విషయాల్లో తప్పుడు ప్రచారం చేయకూడదని, రాజకీయ ప్రయోజనాల కోసం భక్తుల విశ్వాసాలను దెబ్బతీయడం సరికాదని స్పష్టం చేశారు.
మైసూరు మహారాజు జయచామరాజేంద్ర వడియార్ 1945 జనవరి 9న తిరుమలకు వచ్చి శ్రీవారికి అనేక ఆభరణాలు సమర్పించారు. అందులో ఈ హారం కూడా ఉంది. అప్పటి నుంచి ఈ ఆభరణాన్ని టీటీడీ ప్రత్యేక ఉత్సవాల సమయంలో ఉపయోగిస్తోంది. 2001లో జరిగిన గరుడసేవలో భక్తులు విసిరిన నాణేల కారణంగా ఆ హారంలో ఉన్న కెంపు రాయి పగిలిపోయింది. ఆ సంఘటన రికార్డుల్లో నమోదు అయింది. పగిలిన రాయి ముక్కలు ఇప్పటికీ టీటీడీ పేష్కార్ ఆధీనంలో ఉన్నాయి.
కేవలం 50 రూపాయలు..
అసలు రికార్డుల ప్రకారం ఆ రాయి విలువ కేవలం 50 రూపాయలు మాత్రమే. కానీ రమణదీక్షితులు చేసిన ఆరోపణలు పెద్ద కలకలం రేపడంతో టీటీడీ ఆయనపై, అప్పటి ఎంపీ విజయసాయిరెడ్డిపై పరువు నష్టం దావా వేసింది. రూ. 200 కోట్లకు పైగా నష్ట పరిహారం డిమాండ్ చేస్తూ కోర్టులో కేసు నమోదు చేశారు. ఈ చర్య వెనుక కారణం భక్తుల విశ్వాసాలను దెబ్బతీయడం, టీటీడీ ప్రతిష్టను తగ్గించడమేనని సంస్థ పేర్కొంది. అయితే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కేసు ఉపసంహరించుకుంది.
ఇప్పుడు ASI స్పష్టమైన పరిశోధన ఫలితాలు ఇచ్చిన తర్వాత ఈ వివాదానికి పూర్తి విరామం లభించింది. శ్రీవారి హారంలో పింక్ డైమండ్ అనే రాయి అసలు లేదు. అది కేవలం సాధారణ కెంపు రాయి మాత్రమే అని తేలింది. దీంతో ఏళ్లుగా కొనసాగిన వాదనకు తెరపడింది.


