HomeTop StoriesPM Modi : గతంలో ఒకే కుటుంబం పేరు... నేడు మహనీయుల వైభవం

PM Modi : గతంలో ఒకే కుటుంబం పేరు… నేడు మహనీయుల వైభవం

PM Modi Andhra Pradesh Visit : ఆధునిక భారత విమానయాన రంగ చరిత్రలో ఒకవైపు మౌలిక వసతుల విప్లవం… మరోవైపు సాంస్కృతిక వైభవం కలబోసిన చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి పదుల సంఖ్యకే పరిమితమైన ఎయిర్‌పోర్టుల సంఖ్య నేడు శరవేగంగా పెరగడమే కాదు, నామకరణాల్లోనూ కుటుంబ పాలన ముద్ర చెరిగిపోయి జాతీయ వీరుల పేర్లు ప్రకాశిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర గడ్డపై విప్లవ వీరుడు ‘అల్లూరి సీతారామరాజు’ పేరిట రూపుదిద్దుకున్న గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ, గత పాలకుల విధానాలపై ఎందుకు ఘాటుగా స్పందించాల్సి వచ్చింది? రూ.18,000 కోట్ల భారీ ప్రాజెక్టుల ప్రారంభోత్సవంలో ఏపీ భవిష్యత్తుపై ప్రధాని వ్యక్తం చేసిన ఆశావహ దృక్పథం వెనుక ఉన్న అసలు వ్యూహమేంటి? 13 వేల మంది గిరిజన మహిళలు సృష్టించిన గిన్నిస్ రికార్డు థింసా నృత్యం దేశప్రధానిని ఏ విధంగా పరవశింపజేసింది? 

- Advertisement -

‘ఒకే కుటుంబం’ పేరు నుంచి ‘మహనీయుల’ స్మరణ దాకా:  విమానాశ్రయాల నామకరణాల విషయంలో గత ప్రభుత్వాల వైఖరిని ఎండగడుతూ ప్రధాని నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో దేశంలో ఎక్కడ విమానాశ్రయం నిర్మించినా ఒకే ఒక్క కుటుంబం పేర్లే దర్శనమిచ్చేవని, స్థానిక మహనీయులను, స్వాతంత్ర్య సమరయోధులను పూర్తిగా విస్మరించారని విమర్శించారు.

మహనీయులకు సముచిత గౌరవం: ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పరిపాటికి స్వస్తి పలికిందని, దేశ సంస్కృతి, రక్షణ, వికాసంలో భాగస్వాములైన మహనీయుల పేర్లను ఎయిర్‌పోర్టులకు పెడుతున్నామని చెప్పారు. భోగాపురం విమానాశ్రయానికి స్వాతంత్ర్య సమరయోధుడు ‘అల్లూరి సీతారామరాజు’ పేరు నామకరణం చేయడమే దీనికి ప్రత్యక్ష సాక్ష్యమని పేర్కొన్నారు.

మౌలిక వసతుల విప్లవం: 2014 కంటే ముందు దేశవ్యాప్తంగా కేవలం 74 విమానాశ్రయాలు మాత్రమే అందుబాటులో ఉండగా, గత 12 ఏళ్ల తమ యాభై నెలల పాలన విస్తరణలో ఆ సంఖ్యను 166కి పెంచామని గణాంకాలతో వివరించారు. ‘ఉడాన్’ (UDAN) పథకం ద్వారా విమాన ప్రయాణాన్ని సామాన్య మానవుడికి కూడా అందుబాటులోకి తెచ్చామని ప్రధాని పునరుద్ఘాటించారు.

ఉత్తరాంధ్ర పుణ్యభూమికి ప్రణామాలు – రూ.18,000 కోట్ల వరాల జల్లు : పవిత్రమైన ఉత్తరాంధ్ర గడ్డపైకి రావడం తనకు దక్కిన గొప్ప అదృష్టంగా భావిస్తున్నానని ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. సింహాచలం అప్పన్న స్వామికి, విజయనగరం పైడితల్లి అమ్మవారికి ప్రణామాలు అర్పిస్తూ ప్రసంగాన్ని ప్రారంభించిన ఆయన, ఏపీ ప్రగతికి సరికొత్త దిశానిర్దేశం చేశారు. ఏపీ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా సుమారు రూ.18,000 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి సంక్షేమ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు.

ప్రధాన ప్రాజెక్టుల వివరాలు: అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం (భోగాపురం): జిఎమ్‌ఆర్ గ్రూప్ ఆధ్వర్యంలో పీపీపీ పద్ధతిలో రూ.5,640 కోట్లతో అత్యాధునిక సాంకేతికతతో నిర్మితమైన గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్. విశాఖపట్నంలో ఏపీలోనే తొలి సెమీకండక్టర్ తయారీ కేంద్రానికి శంకుస్థాపన చేశారు. 

విద్యుత్ కారిడార్లు & రహదారులు: కర్నూలు పునరుత్పాదక ఇంధన విద్యుత్ ప్రసార వ్యవస్థలు, జాతీయ రహదారుల ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేతృత్వంలోని ‘డబుల్ ఇంజిన్ సర్కార్’ రాష్ట్రంలో శరవేగంగా అభివృద్ధి పనులను పరుగులు తీయిస్తోందని, ‘స్వర్ణాంధ్రప్రదేశ్’ కల నెరవేరే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ప్రధాని ధీమా వ్యక్తం చేశారు.

గిరిజన సాంప్రదాయం గగనసీమల్లో: విశ్వవేదికపై ‘థింసా’ గిన్నిస్ రికార్డు : ఉత్తరాంధ్ర పర్యటనలో ప్రధాని మోదీని అత్యంత మంత్రముగ్ధులను చేసిన ఘట్టం – గిరిజన సాంప్రదాయ ‘థింసా’ నృత్యం. ఏజెన్సీ సంస్కృతిని, గిరిజన కళా వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పేలా ఈ ప్రదర్శన సాగింది.

13,000 మందితో మహా నృత్యం: అరకు, పాడేరు, సీతాంపేట, రంపచోడవరం తదితర గిరిజన ప్రాంతాల నుంచి వచ్చిన దాదాపు 13,000 మందికి పైగా గిరిజన విద్యార్థినులు, మహిళలు ఏకకాలంలో సాంప్రదాయ వస్త్రధారణతో థింసా నృత్యాన్ని ప్రదర్శించారు. ఒకే వేదికపై వేలాది మంది కళాకారులు లయబద్ధంగా అడుగులు వేస్తూ చేసిన ఈ ప్రదర్శన అధికారికంగా ‘గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’లో చోటు దక్కించుకుంది. ఓపెన్ టాప్ జీప్‌లో ప్రయాణిస్తూ కళాకారుల ప్రదర్శనను తిలకించిన ప్రధాని మోదీ, “థింసా నృత్యాన్ని ప్రత్యక్షంగా చూడటం ఒక మధురానుభూతిని ఇచ్చింది. గిరిజన మహిళల ప్రతిభ ప్రపంచ రికార్డు సాధించడం దేశానికే గర్వకారణం” అని కొనియాడారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News