అమరావతి పునర్నిర్మాణ పనులకు ప్రధాని మోదీ(PM Modi) శంకుస్థాపన చేశారు. అనంతరం సభలో మాట్లాడుతూ.. తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. “తల్లి దుర్గాభవాని కొలువైన పుణ్యభూమిలో మిమ్మల్ని కలవడం నాకు ఆనందంగా ఉంది” అని తెలిపారు. పుణ్యభూమి అమరావతి కేవలం నగరం కాదు శక్తి అని స్పష్టం చేశారు. ఆంధ్రుల రాజధాని స్వప్నం సాకారం కాబోతుందని చెప్పారు. ఇది కేవలం శంకుస్థాపన కాదని, ఏపీ ప్రగతి, వికసిత్ భారత్‌కు నిదర్శనమని తెలిపారు. దాదాపు రూ.60 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశానని అన్నారు. ఇవి ఆంధ్రప్రదేశ్‌ను ఆధునిక రాష్ట్రంగా తీర్చిదిద్దే శక్తిగా తీర్చిదిద్దుతాయన్నారు.
అమరావతిని ఐటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, విద్య, వైద్యం, పరిశ్రమలు వంటి అన్ని రంగాలకు కేంద్రంగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. భారతదేశంలోనే అగ్రగామిగా అమరావతిని తీర్చిదిద్దాలన్న సంకల్పాన్ని కేంద్ర ప్రభుత్వం కలిగి ఉందని వెల్లడించారు. ఏపీలోని ప్రతి యువకుడికి ఉద్యోగాలు అందించే ఓ ప్రధాన కేంద్రం అవుతుంది అని తెలిపారు. సీఎం చంద్రబాబు టెక్నాలజీలో ముందడుగు వేశారని.. గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు ఆయనను చూసే తాను కూడా నేర్చుకున్నానని వివరించారు. ఎంత పెద్ద ప్రాజెక్టైనా త్వరగా పూర్తిచేయగల నేత చంద్రబాబు అని కొనియాడారు. ఇక జూన్ 21న ఏపీ ప్రజలతో కలిసి యోగా డేలో పాల్గొంటానని చెప్పారు. వచ్చే 50 రోజుల్లో ఏపీలో యోగాకు అనుకూలమైన వాతావరణం కల్పించాలని సూచించారు.