ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజధాని అమరావతి(Amaravati) పునఃనిర్మాణంపై దృష్టిసారించింది. ఇప్పటికే పలు రకాల పనులు చకాచకా జరుగుతున్నాయి. ఐఏఎస్ అధికారుల భవనాలు, రోడ్లు వంటి నిర్మాణాల్లో వేగం పుంజుకుంది. శాశ్వత భవనాలు నిర్మాణాలకు సీఆర్డీఏ టెండర్లను కూడా పిలిచింది. పలు రకాల పనులకు సీఆర్డీఏ అథారిటీ, ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాయి. ఈ క్రమంలోనే అమరావతి పునఃనిర్మాణానికి ప్రధాని మోడీ(PM Modi)ని ఆహ్వానించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
మే 2వ తేదీన అమరావతిలో ప్రధాని పర్యటన ఉంటుందని సీఎం చంద్రబాబు కేబినెట్ సమావేశంలో తెలిపారు. మూడేళ్లలో శాశ్వత సచివాలయం, అసెంబ్లీ , హైకోర్టు, రహదారులు పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు వివరించారు. కాగా గతంలో అమరావతి శంకుస్థాప కార్యక్రమానికి ప్రధాని హాజరైన సంగతి తెలిసిందే. అయితే 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అమరావతి నిర్మాణం ఆగిపోయిన విషయం విధితమే. మళ్లీ కూటమి ప్రభుత్వం రాగానే పనులు శరవేగంగా జరుగుతున్నాయి.