Friday, November 22, 2024
Homeఆంధ్రప్రదేశ్Borugadda Anil: వైసీపీ నేతల అండతోనే రెచ్చిపోయా: బోరుగడ్డ

Borugadda Anil: వైసీపీ నేతల అండతోనే రెచ్చిపోయా: బోరుగడ్డ

వైసీపీ ప్రభుత్వంలోని కీలక నేతలు తనను ప్రోత్సహించడంతోనే అప్పటి ప్రతిపక్ష నేతలైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్‌లపై వ్యక్తిగత దూషణలు చేశానని వైసీపీ నేత, రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్(Borugadda Anil) తెలిపారు. గత బుధవారం రాత్రి అనిల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అనంతరం పోలీసుల విచారణలో అతడు కీలక విషయాలు వెల్లడించినట్లు సమాచారం. గురువారం మధ్యాహ్నం గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించిన పోలీసులు.. జిల్లా కోర్టులో హాజరుపరిచారు. దీంతో న్యాయమూర్తి అతడికి 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. ఈ నేపథ్యంలో బోరుగడ్డను రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు.

- Advertisement -

అరండల్‌పేట పీఎస్‌ల డీఎస్పీ జయంరాంప్రసాద్ నేతృత్వంలో సుమారు రెండు గంటలకుపైగా అనిల్‌కుమార్‌ను విచారించినట్లు తెలిసింది. ‘గత ప్రభుత్వంలో నాటి ప్రతిపక్ష నాయకులను, మహిళలను ఎందుకు అసభ్య పదజాలంతో దూషించావు. ఎన్నికల ఫలితాల తర్వాత ఎక్కడికెళ్లావు? ఇన్ని రోజులు నీకు ఎవరు ఆశ్రయం ఇచ్చారని’ ప్రశ్నించారట. అయితే కొంతమంది కీలక వైసీపీ నేతల ప్రోద్భతంలోనే వ్యక్తిగత దూషణలకు దిగానని చెప్పినట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. తాము చెప్పినట్లు చేస్తే పెద్ద నేతగా ఎదిగే అవకాశం ఉందని చెప్పడంతో.. వారి మాటలు నమ్మి అలా ప్రవర్తించారని వాపోయారట. ఇకపై ఇలాంటి తప్పులు చేయానని ప్రాధేయపడినట్లు తెలుస్తోంది.

అయితే ఆ కీలక నేతల పేర్లు మాత్రం చెప్పడానికి నిరాకరించారట. గతంలో గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా పనిచేసిన ఓ నేత అండతోనే బూతులతో రెచ్చిపోయానని.. కానీ ఇప్పుడు తనను పట్టించుకునే వారు లేరని చెప్పినట్లు సమాచారం. కాగా కేవలం ఒక్క గుంటూరు జిల్లాలోనే అనిల్‌కుమార్‌పై 20కి పైగా కేసులున్నాయి. అంతేకాకుండా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లోనూ కేసులు నమోదయ్యాయి.

ఇదిలా ఉంటే వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు బోరుగడ్డ అనిల్ చేసిన అరాచకాలు అన్ని ఇన్ని కావు. అప్పటి సీఎం జగన్(Jagan) ఆదేశిస్తే గంటలో ప్రతిపక్ష నేత చంద్రబాబు(ChandraBabu)తో పాటు లోకేష్‌(Lokesh)ను చంపేస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే పవన్ కళ్యాణ్‌(PawanKalyan) ఇంటి బెడ్ రూంకు వెళ్లి కూర్చుంటానంటూ అసభ్యపదజాలంతో రెచ్చిపోయారు. దీంతో టీడీపీ, జనసేన కార్యకర్తలు అనిల్‌పై తీవ్ర ఆగ్రహంతో రగిలిపోయారు. వివిధ పోలీస్ స్టేషన్లలో అతడిపై ఫిర్యాదుచేశారు. అయితే అప్పుడు వైసీపీ అధికారంలో ఉండటంతో బోరుగడ్డను పోలీసులు అరెస్ట్ చేయలేకపోయారు. తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఎట్టకేలకు అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. దీంతో తెలుగు తమ్ముళ్లు, జనసైనికులు కాస్త శాంతించారు. కానీ తమ నాయకులను వ్యక్తిగతంగా దూషించిన బోరుగడ్డ అనిల్‌ను చట్టప్రకారం మరింత కఠినంగా శిక్షించాల్సిందేనని పట్టుబడుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News