Sajjala Bhargava Reddy| వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే ఆయనపై టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి ఘటనలో కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆయనను నిందితుడిగా పేర్కొంటూ పోలీసులు విచారణ కూడా చేశారు. తాజాగా ఆయన కుమారుడు, వైసీపీ సోషల్ మీడియా ఇంఛార్జ్ సజ్జల భార్గవ్ రెడ్డి(Sajjala Bhargava Reddy)పై కడప జిల్లా పులివెందులలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నమోదైంది.
సింహాద్రిపురం మండలానికి చెందిన హరి అనే దళిత వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సజ్జల భార్గవ్‌రెడ్డితో పాటు వైసీపీ నేతలు అర్జున్ రెడ్డి, వర్రా రవీందర్ రెడ్డిపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద పులివెందుల పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. సజ్జల భార్గవ్ రెడ్డి నేతృత్వంలో రవీందర్ రెడ్డి గత కొన్నేళ్లుగా టీడీపీ నేతలపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడుతున్నారని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీనిపై ప్రశ్నించిన తనను కులం పేరుతో దూషించారని తెలిపాడు. దీంతో అతని ఫిర్యాదు మేరకు ముగ్గురిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
అయితే వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్ట్ చేయడంపై ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వారిపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై న్యాయపరంగా పోరాటం చేస్తామని వెల్లడించారు.