Perni Nani| వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి పేర్ని నానికి భారీ షాక్ తగిలింది. రేషన్ బియ్యం అవకతవకాలపై ఆయన భార్య సతీమణి జయసుధపై పోలీసులు కేసు నమోదు చేశారు. రేషన్ బియ్యం అక్రమాలపై పౌరసరఫరాల అధికారి కోటిరెడ్డి ఫిర్యాదుమేరకు ఆమెపై కేసు నమోదు చేసినట్లు మచిలీపట్నం పోలీసులు తెలిపారు. కాగా గత వైసీపీ ప్రభుత్వం హయాంలో నాని తన భార్య జయసుధ పేరిట గోడౌన్ నిర్మించిన సివిల్ సప్లై శాఖకు అద్దెకు ఇచ్చారు. అయితే ఆ గోదాముల్లో నిల్వ ఉంచిన బియ్యం నిల్వల్లో తేడాలు వచ్చినట్లు ఇటీవల అధికారులు గుర్తించారు.
అయితే తన గోడౌన్‌లో ఆకస్మికంగా బియ్యం తరలించడం వల్ల తరుగు వచ్చిందని.. వేబ్రిడ్జి పనిచేయకపోవడం వల్ల దాదాపు 3,250 బస్తాల తరుగు ఉన్నాయని జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మకు పేర్ని నాని లేఖ రాశారు. తరుగు వచ్చిన బియ్యం బస్తాలకు తాము సొమ్ములు చెల్లించేందుకు సిద్ధమని పేర్కొన్నారు. దీంతో అధికారులు నవంబర్ 28, 29 తేదీల్లో తనిఖీలు నిర్వహించగా 3,700 బస్తాల(185 టన్నుల) బియ్యం తగ్గాయని గుర్తించారు.
దీనిపై సమగ్ర విచారణ చేయాలని పౌరసరఫరాల సంస్థ ఎండీ మన్‌జీర్ జిలానీ ఆదేశించారు. బియ్యం గల్లంతు విషయంలో నానిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో రూ.1.80 కోట్లు జరిమానా చెల్లించడంతో పాటు క్రిమినల్ కేసులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంతే కాకుండా గోడౌన్‌ను బ్లాక్ లిస్టులో పెడతామని అధికారులు వెల్లడించారు. తాజాగా దీనిపై అధికారి కోటిరెడ్డి ఫిర్యాదు మేరకు నాని సతీమణిపై కేసు నమోదుచేశారు.